Amaravati Seed Axis Road: అమరావతి రాజధాని నిర్మాణం సకాలంలో పూర్తిచేసి ప్రారంభించాలన్నది ప్రభుత్వ నిర్ణయం. వీలైనంత త్వరగా తొలి దశ పనులు పూర్తిచేసి ప్రారంభించాలన్న ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. అందులో భాగంగా కీలకమైన మైలురాయి ఆవిష్కృతం కానుంది. అమరావతికి ప్రధాన జీవనాడిగా పరిగణించే సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈనెల 13న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిఆర్డిఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జాతీయ రహదారులను రాజధాని నగర పరిపాలన కేంద్రంతో అనుసంధానించే ఈ ప్రతిష్టాత్మక రహదారి అందుబాటులోకి రానుంది. తద్వారా రాజధాని ప్రాంతానికి రవాణా కనెక్టివిటీ సరికొత్త రూపురేఖలను సంతరించుకోనుంది.
కూటమి వచ్చిన వెంటనే..
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. 2028 నాటికి తొలిదశ పూర్తి చేయాలన్నది ఆలోచన. అయితే అత్యంత కీలకమైన సీడ్ యాక్సిస్ రోడ్డు అందుబాటులోకి రావడం శుభ పరిణామం. అదేరోజు అమరావతిలో నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బహుళ అంతస్తుల నివాస సముదాయాలను కూడా సాధారణ పరిపాలన శాఖకు అప్పగించనున్నారు. అత్యాధునిక వసతులు, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ నివాస సముదాయాల అప్పగింతతో పాలనయంత్రాంగం రాజధాని నుంచే పూర్తిస్థాయిలో పని చేసేందుకు మార్గం సుగమం కానుంది. ఒకే రోజు సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభం, ప్రజా ప్రతినిధుల క్వార్టర్స్ అప్పగింత జరగడం సరికొత్త టర్నింగ్ పాయింట్ గా నిలవనుంది.
ప్రపంచ స్థాయి నగరంగా..
ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ బృహత్తర ప్రణాళిక. దానికి సీడ్ యాక్సిస్ రోడ్డు అనేది వెన్నెముక లాంటిది. విజయవాడ, గుంటూరులో నుంచి అమరావతి సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ తదితర కీలక ప్రాంతాలకు చేరుకోవడానికి ఇది ప్రధాన ప్రవేశ మార్గం. గతంలో నిలిచిపోయిన మౌలిక సదుపాయాల పనులను యుద్ధ ప్రాతిపదికిన ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. స్వల్ప కాలంలోనే ప్రధాన రహదారులను, భవనాలను సిద్ధం చేసి ప్రారంభోత్సవానికి తీసుకురావడం చిన్న విషయం కాదు.
ఆగస్టు 13న ప్రారంభం..
ఆగస్టు 13 నవ్యాంధ్రప్రదేశ్లో ఒక పండుగ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఇప్పటికే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంతో ఉత్తరాంధ్రలో ఒక సానుకూలత ఏర్పడింది. ఇప్పుడు అమరావతి రాజధాని లో కీలకమైన నిర్మాణాలను ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా ఒక రకమైన అనుకూల వాతావరణం ఏర్పరచాలన్నది ప్రభుత్వ ఆలోచన. అమరావతికి ఒకవైపు కనెక్టివిటీ పెరుగుతుండడం, మరోవైపు ప్రజాప్రతినిధులు, అధికారులకు శాశ్వత నివాసాలు సిద్ధమవుతుండడంతో.. రాబోయే రోజుల్లో అమరావతిలో ఆర్థిక, పాలనాపరమైన కార్యకలాపాలు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఈ నిర్మాణాలు అందుబాటులోకి వస్తుండడంతో మిగతా వాటిపై కూడా ప్రభావం చూపనుంది. వీలైనంత త్వరగా అవి పూర్తి అయ్యేందుకు అవకాశం కలగనుంది.