Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈరోజు జాతికి అంకితం చేశారు. ప్రధాని సరిగ్గా 10:45 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా 200 మంది విద్యార్థినుల కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కడ నుంచి టెర్మినల్ భవనానికి చేరుకున్న ఆయన.. తిరుగు ప్రయాణంలో భాగంగా ఓపెన్ టాప్ జీపులో వెళ్తుండగా.. ఉత్తరాంధ్ర గిరిజనుల సాంస్కృతిక ప్రదర్శన ధింసా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 13000 మంది గిరిజన కళాకారులు ఈ నృత్య ప్రదర్శనలు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వారి నృత్యాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. గిరిజన సంస్కృతి వైభవాన్ని చాటి చెప్పేలా సాగిన ఈ అద్భుత ప్రదర్శన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
* ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలా..
ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు. ఈ విమానాశ్రయం ఏర్పాటుతో ఉత్తరాంధ్ర స్వరూపమే మారిపోతుందన్న అంచనాలు ఉన్నాయి. అందుకే ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలా ఇక్కడి కట్టడాలు ఉన్నాయి. ఈ ప్రారంభోత్సవంలో సైతం ఉత్తరాంధ్ర సంస్కృతిని, సంప్రదాయాలను చాటి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకే ప్రతిష్టాత్మకంగా ఈ నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేసింది. గత కొంతకాలంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో ధింసా నృత్యాన్ని భాగస్వామ్యం చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు వేల కళాకారులతో ప్రదర్శన ఏర్పాటు చేసి గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించేలా చేయాలని ప్రభుత్వం భావించింది. అందుకే ఈ సాంస్కృతిక నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేసింది.
* ఈ నృత్యమే ఎందుకు అంటే..
ఉత్తరాంధ్రలో గిరిజనులు అధికం. రాష్ట్రంలోని వారి సంఖ్య ఎక్కువగా ఉండేది ఈ ప్రాంతంలోనే. అందుకే పార్వతీపురం తో పాటు సీతంపేటలో ఐటీడీఏలు కొనసాగుతూ వస్తున్నాయి. ఉమ్మడి విశాఖ మన్యంలో కూడా ఐటీడీఏ పరిధి నడుస్తోంది. అయితే గిరిజనుల సంప్రదాయ నృత్యం గా ధింసా ఉంది. సాంప్రదాయ వాయిద్యాలు చెప్పులకు అనుగుణంగా గిరిజన కళాకారులు లయబద్ధమైన అడుగులు, ఏక రీతి విన్యాసాలు ఈ నృత్య ప్రదర్శనలో ప్రత్యేకం అని చెప్పాలి. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఓపెన్ టాప్ జీప్ లో వెళ్తూ ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం మంత్రముగ్ధులయ్యారు. అయితే ఏకకాలంలో వేలాది మందితో నిర్వహించిన ఈ గిరిజన సంప్రదాయ నృత్య ప్రదర్శన.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో లిఖించబడడం నిజంగా గొప్ప విషయం. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.