YSR Congress Party: ఏ రాజకీయ పార్టీ అయినా ఏదో ఒక లబ్ధి కోసమే ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంది. ఇప్పుడు దగా డీఎస్సీ అంటూ పెద్ద ఎత్తున ఆందోళన జరుపుతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. దానికి విరుగుడుగా ఉపాధ్యాయుల ఆత్మగౌరవ కార్యక్రమాలు నడుస్తున్నాయి. మొన్ననే రాయలసీమ వ్యాప్తంగా కొత్త ఉపాధ్యాయులు.. కర్నూలు కొండారెడ్డి బురుజు పైకి ఎక్కి నిరసన తెలిపారు. రాజకీయాల కోసం తమ పొట్ట కొట్టవద్దని.. అహర్నిశలు శ్రమించి ఉపాధ్యాయ పోస్టులు దక్కించుకున్న తమపై కుట్రలు చేయవద్దని కోరారు. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయులు చలో తాడేపల్లి కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొండారెడ్డి బురుజు సెంటర్ పైకి ఎక్కిన వారు.. తాడేపల్లి ప్యాలెస్ పైకి ఎక్కలేరా అన్న మంత్రి సవిత మాటలు చూస్తుంటే మాత్రం.. అంతదాకా వెళ్లేందుకు నూతన ఉపాధ్యాయులు సిద్ధపడుతున్నట్లు అర్థం అవుతోంది.
* జనతా కాక్రోచ్ ఉద్యమంతో..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డీఎస్సీ పై ఎందుకు పడిందో అర్థం కావడం లేదు. జాతీయస్థాయిలో నీట్ ప్రశ్న పత్రాలు లీకేజీ విషయంలో జనతా కాక్రోచ్ ఉద్యమం నడిచింది. దేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పునకు కారణం అయ్యింది. అయితే ఆ ఉద్యమం పాలపొంగు మాత్రమే. కేవలం యువతలో వచ్చిన ఆగ్రహజ్వాలతో ఉద్యమం మిన్నంటింది. అప్పుడే వైయస్సార్ కాంగ్రెస్ రంగంలోకి దిగింది. నీట్ ఉద్యమం మాదిరిగా డీఎస్సీపై ఉద్యమిస్తే మంచి ఫలితం ఉంటుందన్న నిర్ణయానికి వచ్చింది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా దగా డీఎస్సీ అంటూ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.
* ఆధారాలు లేవు అనుమానాలతోనే..
జనతా కాక్రోచ్ ఉద్యమంతో.. ఏపీలో డీఎస్సీ 2025 లో అక్రమాలపై పోల్చుకుంటూ ఉద్యమం చేపడితే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఎందుకంటే ఇక్కడ పేపర్ లీకేజీ అయినట్టు.. అక్రమాలు జరిగినట్టు ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆపై ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ లేదు. ఒక్క ఉపాధ్యాయ పోస్టును నియమించలేదు. అంటే ఆ పని చేయకపోగా.. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించడంతో దానిపై రాజకీయ ప్రచారం మొదలుపెట్టింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. పైగా ఉపాధ్యాయులు ఆత్మ గౌరవం పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాలతో ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దగాడిఎస్సి అంటూ చేస్తున్న ఆందోళనలు కేవలం ప్రేరేపితం కాగా.. కొత్త ఉపాధ్యాయుల ఆత్మగౌరవం అనేది వారి మనోభావం. అందుకే వారు ఎంత దాక్కైనా వెళ్లేందుకు… తమ ఆవేదనను వ్యక్తపరిచేందుకు ముందుకు వస్తున్నారు. ఉపాధ్యాయుల ఆత్మ గౌరవంతో పోల్చుకుంటే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దగా డిఎస్సి ఇట్టే తేలిపోతోంది.