Mukka Sravani: విశాఖపట్నం నగర ప్రధమ పౌరురాలు.. జీవీఎంసీ మేయర్ ముక్క శ్రావణి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె రాజకీయ ఓనమాలు దిద్దడంలో.. ఆమె రాజకీయంగా ఎదగడంలో వెన్ను తట్టి నడిపించిన కన్న తండ్రి.. సీనియర్ టిడిపి నాయకుడు ముక్కా ముత్యాల నాయుడు గుండెపోటుతో కన్నుమూశారు. ఒకవైపు తన కుమార్తె నగర మేయర్ గా అత్యున్నత పీఠాన్ని అధిష్టించిందన్న ఆనందంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఊహించని ఘోర విషాదం శోకసముద్రంలో ముంచింది.
ముత్యాల నాయుడు టిడిపిలో సీనియర్ నాయకుడు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజల మనిషి. 1983లో టిడిపి ఆవిర్భావం నుంచి ఆయన ఆ పార్టీకి వీర విధేయుడుగా కొనసాగుతున్నారు. నిఖార్సయిన కార్యకర్తగా సేవలో అందిస్తున్నారు. దివంగత పార్లమెంట్ సభ్యుడు ఎంవీవీఎస్ మూర్తికి ముఖ్య అనుచరుడిగా కొనసాగారు. విశాఖపట్నంలో పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేశారు. ఆయన నిబద్ధతకు గుర్తింపుగా 2007లో కార్పొరేటర్ గా టిడిపి అవకాశం కల్పించింది. నాటి ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఆయన భార్య ఈశ్వరి కూడా 2007లో కార్పొరేటర్ గా పోటీ చేసి.. విజయం సాధించారు.
ఒక తండ్రి తన పిల్లలను ఉన్నత స్థాయిలో చూడాలి అని అనుకుంటారు. దీనికి ముత్యాల నాయుడు మినహాయింపు కాదు. వృత్తిరీత్యా వైద్యుడు అయిన ముత్యాలనాయుడు.. తన కుమార్తె శ్రావణిని ప్రజాసేవ వైపు ప్రోత్సహించారు. ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. 2021లో ఆమె 26వ వార్డు నుంచి కార్పొరేటర్ గా గెలిచినప్పుడు.. ముత్యాల నాయుడు పాడిన ఆనందం మామూలుది కాదు. ఇటీవల జరిగిన జీవీఎంసీ ఎన్నికలలో శ్రావణి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఏకంగా రెండున్నర లక్షల ఓట్ల మెజారిటీ తేడాతో విశాఖ మేయర్ అభ్యర్థిగా విజయం సాధించారు. మొత్తంగా ముత్యాల నాయుడు తన బిడ్డ నగరం మేయర్ కావాలి అని కలలు కన్నారు.. చివరికి దానిని నెరవేర్చుకున్నారు. “నా కుమార్తె విశాఖ నగర మేయర్ అయింది” అని మురిసిపోయిన ముత్యాలనాయుడు కళ్ళల్లో ఆనందం ఎంతో కాలం నిలవలేదు. విశాఖపట్నం ప్రధమ పౌరురాలిగా తన కూతురు నగరానికి చేసే సేవలను కలరా చూసుకునే అదృష్టం ఆయనకు దక్కకుండానే పోయింది. క్రూరమైన విధి ఆయనను గుండెపోటు రూపంలో బలితీసుకుంది. ముత్యాల నాయుడు మరణం పట్ల విశాఖపట్నంలో రాజకీయ ప్రముఖులు.. పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు. కష్టకాలంలో శ్రావణి కుటుంబం ధైర్యంగా ఉండాలని సూచిస్తున్నారు.