AP Local elections: వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు. ఒకవేళ ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే అటువంటి చోట నియోజకవర్గ ఇన్చార్జి లకు టికెట్లు ఇవ్వనని తేల్చి చెప్పారు. కానీ ఈ ప్రకటన వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు అర్థం అవుతోంది. కచ్చితంగా ఈ ప్రకటనతో తెలుగుదేశం కూటమి ముందుగానే పావులు కదుపుతుంది. ముందుగా పులివెందుల నియోజకవర్గం పైనే ఫోకస్ పెడుతుంది. గత ఏడాది పులివెందుల జడ్పిటిసి స్థానం ఏ విధంగా పట్టుబట్టి గెలిచిందో.. కచ్చితంగా పులివెందుల మునిసిపాలిటీని సైతం అలాగే కైవసం చేసుకుంటుంది. ప్రత్యక్ష ఎన్నికలు కావడంతో ఒకరు మున్సిపల్ అభ్యర్థిగా వైసీపీ తరఫున బరిలో నిలుస్తారు. కానీ ఆ పార్టీకి కౌన్సిలర్ల అభ్యర్థులు మాత్రం దొరకరు. అంతలా ఉంటుంది టిడిపి వేట అక్కడ. ఇప్పటికే టిడిపి బృందం ఒకటి పులివెందులలో వాలిపోయింది. వారు వార్డుల్లో ఏకగ్రీవాలకు అప్పుడే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.
పులివెందులలో ఏకగ్రీవాలు..
పులివెందులలో ఏకగ్రీవాలు జరిగితే మాత్రం జగన్మోహన్ రెడ్డి నుంచి మరో ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఏకపక్షంగా గెలిచి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్థానం దక్కకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా డిఫెన్స్ లో పడతారు. అయితే కీలక కూటమి నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో చాలా మున్సిపాలిటీలు ఏకగ్రీవాలు జరుగుతాయి. అది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ఒకవేళ ఏకగ్రీవాలు జరిగి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఓటమి ఎదురైతే.. జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తారు. ఇది జరిగే పని అంటూ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
అప్పట్లో చంద్రబాబు సంచలన నిర్ణయం…
2021లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో ముందుగా పంచాయితీల ఎన్నికలు జరిగాయి. తరువాత మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. కుప్పం నియోజకవర్గంలో అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మోహరించింది. ఎలాగైనా మున్సిపాలిటీ ని కైవసం చేసుకోవాలని చూసింది. అయినా సరే టిడిపి శ్రేణులు ప్రతిఘటించాయి. కానీ ఫలితం లేకపోయింది. పరిమిత వార్డులకే టిడిపి పరిమితం అయింది. అంతకుముందు పంచాయతీ ఎన్నికల్లో సైతం ప్రలోభాలతో, భయపెట్టి మరి వైసీపీ సానుభూతిపరులు గెలిచారు. కేవలం కుప్పం ఫలితాలతో చంద్రబాబు ఆలోచనలో పడ్డారు. అందుకే తరువాత వచ్చిన మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలను బహిష్కరించారు చంద్రబాబు. ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి అదే పరిస్థితి ఎదురైన మరుక్షణం.. తరువాత ఆ రెండు స్థానిక ఎన్నికలను జగన్మోహన్ రెడ్డి బహిష్కరిస్తారు. ఇది ఒక వ్యూహం అని తెలుస్తోంది. స్థానిక ఎన్నికలు బహిష్కరించిన చంద్రబాబు స్ట్రాటజీ అప్పట్లో చాలా విమర్శలకు తావిచ్చింది. కానీ సార్వత్రిక ఎన్నికల నాటికి ఆ ప్రయోగమే ఫలించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సైతం అదే ఫార్ములాను అనుసరించనున్నారు.