Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. తనను మానసికంగా, శారీరకంగా హింసించారు అంటూ జోగి రమేష్ కోడలు మేఘన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. దీనిపై పోలీసులు జోగి రమేష్ కుటుంబంలో 11 మందిపై కేసు నమోదు చేశారు. అయితే ఇంతలోనే వారి మధ్య సయోధ్యకు పంచాయితీ జరిగినట్లు తెలుస్తోంది. జోగి రమేష్ ఇంట్లో జరిగిన ఇరు వర్గాల పంచాయితీకి సంబంధించి కొన్ని వీడియోలు సైతం సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. అనవసరంగా తనపై ప్రెజర్ పెట్టి పెళ్లి చేయించారని జోగి రమేష్ కుమారుడు రాజీవ్ సొంత కుటుంబ సభ్యులపై విరుచుకుపడిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. తనకు అసలు పెళ్లి ఇష్టం లేదని చెప్పిన రాజీవ్.. ఆపై మేఘన బంధువుల ఫైర్.. రాజీవ్ తీరుపై జోగి రమేష్ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేయడం.. తరువాత తప్పు నీదంటూ రాజీవ్ తండ్రి రమేష్ పై తిరగబడడానికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. మరోవైపు వివాదాల అనంతరం కోడలు మేఘనాతో జోగి రమేష్ భార్య ఫోన్లో మాట్లాడిన ఆడియో సంభాషణలు సైతం బయటకు వచ్చాయి. గత నెల రోజులుగా దీనిపైనే వివాదం నడుస్తోంది. ఈ తరుణంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఈరోజు మీడియా ముందుకు వచ్చారు.
* వివాహం తర్వాత విభేదాలు..
అందరి కుటుంబాల మాదిరిగానే తమ కుటుంబంలో కూడా కుమారుడు రాజీవ్ వివాహం జరిగిందని చెప్పుకొచ్చారు జోగి రమేష్. వివాహం తర్వాత తన కుమారుడు, కోడలు మధ్య విభేదాలు వచ్చాయని.. పిల్లలు కలిసి ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారని.. విడిపోవాలని ఎవరూ కోరుకోరని పేర్కొన్నారు. అయితే వారి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా పరిస్థితి కోర్టు వరకు వెళ్లిందని చెప్పారు. జూన్ 8న తన కుమారుడు రాజీవ్ విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. జూలై 24న మేఘన తమ కుటుంబం పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. విడాకుల ప్రక్రియ కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై ఎక్కువగా మాట్లాడలేనని చెప్పారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తన కుటుంబం పై జరుగుతున్న ప్రచారం పై ఆవేదన వ్యక్తం చేశారు. తన కోడలు మేఘనను కన్న కూతురిలా చూసుకుందామని.. పిల్లల మధ్య వచ్చిన విభేదాలను పెద్దవి చేసి రాజకీయ రంగు పులమడం సరికాదన్నారు జోగి రమేష్.
* రాజకీయ ప్రోత్సాహం..
మరోవైపు తన కుటుంబం పై వచ్చిన మతమార్పిడి ఆరోపణలపై కూడా స్పందించారు జోగి రమేష్. తన భార్య బైబిల్ చదివితే తప్పేంటి అని ప్రశ్నించారు. ఏసుక్రీస్తు బోధనలు వినడం తప్పా అంటూ నిలదీశారు. తమ కుటుంబం అన్ని మతాలను గౌరవిస్తుందని చెప్పారు. తిరుపతి వెళ్తామని.. దుర్గ గుడికి వెళ్తామని.. యాగాల్లో కూడా పాల్గొంటామని తెలిపారు. కేవలం మత విశ్వాసాల ఆధారంగా తమ కుటుంబం పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఈ విషయంలో ఎల్లో మీడియా అతి చేసింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను ఇలా బహిరంగంగా చర్చించడం సమంజసం కాదన్నారు. మీకు కూడా కుటుంబాలు, పిల్లలు ఉన్నారన్న విషయాన్ని గ్రహించుకోవాలన్నారు. మహా టీవీ న్యూస్ ఛానల్ ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో సీఎం చంద్రబాబు తో పాటు లోకేష్ ఉన్నట్లు అర్థం వచ్చేలా మాట్లాడారు జోగి రమేష్. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని.. సరైన సమయంలో బయటపెడతానంటూ సవాల్ చేశారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కార్యాలయానికి తన కోడలు మేఘన వెళ్లిన సంచలన వీడియోను ఈ సందర్భంగా విడుదల చేశారు జోగి రమేష్. రాజకీయ జోక్యం ఉందనడానికి ఇంతకంటే ఏం సాక్ష్యం ఉందంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. మొత్తానికి అయితే ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చి జోగి రమేష్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
View this post on Instagram