Jogi Ramesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జోగి రమేష్ కుటుంబంలో చోటుచేసుకున్న వ్యవహారాల గురించి మిగతా అన్ని మీడియా సంస్థల కంటే మహా న్యూస్ చాలా లోతుగా వెళ్ళింది. కాకపోతే వ్యక్తిగత విషయాలను ఇంత లోతుగా చూసే హక్కు ఎవరిచ్చారు అనేది ఒక మీడియా అధినేతగా మహా వంశీ ఆలోచించుకోవాలి. విలువలు లేకుండా.. వలువలు లేకుండా అలా ఎలా వార్తలు ప్రసారం చేస్తారు అనేది కూడా ఆయన ఒకసారి తనకు తాను ప్రశ్నించుకోవాలి.
మహా వంశీ తన చానల్లో ప్రసారం చేసిన వార్తలను చూసి జోగి రమేష్ కు కోపం వచ్చింది. ఒక ఏబీఎన్.. ఒక టీవీ5.. ఒక టీవీ9 చేయలేని పనులను మహా వంశీ చేశాడు అంటే మామూలు విషయం కాదు.. ఈ విషయంలో మహా వంశీకి వీర తాళ్లు వేయాల్సిందే. కానీ ఒక కుటుంబంలో జరిగిన వ్యక్తిగత అంశాలకు ఇలాంటి రంగులు పూయడం.. మసాలా వేసి సినిమా కంటెంట్ లాగా ప్రసారం చేయడం నిజంగానే పాత్రికేయ విలువలకు నిదర్శనమా.. ఇది మహా వంశీ ఆలోచించుకోవాలి.
మహా వంశీ ప్రసారం చేసిన వార్తలను చూసి జోగి రమేష్ కు కోపం పీక్స్ లోకి వెళ్ళింది. ప్రెస్ మీట్ లో ఏకంగా మహా వంశీని ఉద్దేశించి నా బామ్మర్ది అని జోగి రమేష్ విమర్శించాడు. వాస్తవానికి జోగి రమేష్ నోరు తెరిస్తే ఎటువంటి మాటలు వస్తాయో వైసిపి అధికారంలో ఉన్నప్పుడు అందరు చూశారు. చివరికి ఆ మధ్య ఆయన మీద ఆరోపణలు వచ్చినప్పుడు దుర్గ గుడి దగ్గర చేతిలో హారతి కర్పూరం పట్టుకొని వెలిగించినప్పుడు ఎటువంటి మాటలు మాట్లాడారో అందరూ చూశారు. అటువంటి జోగి రమేష్ మహా వంశీని ఉద్దేశించి బామర్ది అని పిలవడం నిజంగానే కాస్త ఆశ్చర్యం అనిపించింది.
జోగి రమేష్ తనను బామ్మర్ది అని పిలవడంతో.. దొరికిందే సందు అనుకొని మహా వంశీ ఏకంగా ఒక గంట పాటు డిబేట్ రన్ చేశాడు. తనను బామ్మర్ది అని పిలిచినందుకు గొప్పగా ఫీలయ్యాడు. పైగా జోగి రమేష్ ను బావగారు అని సంబోధించాడు. మొత్తానికి మేఘన ఇష్యూ ద్వారా జోగి రమేష్ కుటుంబంతో మహా వంశీకి బంధుత్వం ఏర్పడింది. మరి ఈ బావ బామ్మర్దుల సంబంధం గొప్పగా ఉంటుందా.. ఎందుకంటే ఇప్పటివరకు మీడియాలో కేసీఆర్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మధ్య మాత్రమే బావా బామ్మర్దుల సంబంధం ఉండేది. ఎందుకంటే ఒక పొలిటికల్ నాయకుడు.. ఒక మీడియా అధినేత మధ్యలో సాధ్యమైనంత వరకు ఇటువంటి వ్యక్తిగత సంబంధాలు ఉండవు. కానీ ఆ సంబంధం కొనసాగించి సరికొత్త రికార్డు సృష్టించారు కేసీఆర్.. రాధాకృష్ణ.. ఇప్పుడు ఇదే సంబంధాన్ని మహా వంశీ.. జోగి రమేష్ కొనసాగిస్తారా.. ఏమో చూడాలి.. అన్నట్టు ఇప్పుడు కెసిఆర్.. రాధాకృష్ణ మధ్య అంత గొప్ప సంబంధాలు లేవు. పైగా ఇద్దరు కారాలు మీరాలు నూరుకుంటూనే ఉన్నారు.