Jana Sena Party: తెలంగాణలో జనసేన బలోపేతం పై నాయకత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కార్యకలాపాలు మొదలు పెట్టింది. అందుకు గాను హైదరాబాదులో కేంద్ర కార్యాలయాన్ని కూడా తెరిచారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని నిర్ణయించింది. ముందుగా గ్రేటర్లో సత్తా చాటి.. మిగతా రాష్ట్రమంతా విస్తరించాలన్నది జనసేన ప్రణాళికగా తెలుస్తోంది. అందులో భాగంగా భారీ ఎత్తున చేరికలు జరగాలని భావిస్తోంది. ముఖ్యంగా విద్యాధికులు, ఆర్థిక స్థితిమంతులు, ఆంధ్రమూలాలు ఉన్నవారు జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల భారీగా చేరికలు పెరగడం చూస్తుంటే జనసేన అనుకున్నది సాధించడం ఖాయమని తెలుస్తోంది.
* అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి..
జనసేన అంటేనే యూత్ బలం అధికంగా ఉంటుంది. మొన్నటి ఎన్నికల్లో ఏపీలో సూపర్ విక్టరీ సాధించింది ఆ పార్టీ. కానీ అంతకుముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కనీస స్థాయిలో మాత్రమే ఓట్లు తెచ్చుకుంది. అప్పటినుంచి జనసేన కార్యకలాపాలు అంతంతమాత్రంగా నడిచేవి. కానీ మొన్న పవన్ కళ్యాణ్ విషయంలో తెలంగాణ నుంచి కొన్ని స్వరాలు వినిపించాయి. అప్పటినుంచి మొత్తం సీన్ మారింది. తెలంగాణలో సైతం జనసేన యాక్టివ్ కావాలని భావిస్తూ పవన్ కళ్యాణ్ ఒక కార్యాలయాన్ని ప్రారంభించారు. అప్పటినుంచి జనసేన క్రియాశీలకంగా మారింది. అయితే తెలంగాణ వ్యాప్తంగా కాకుండా.. ఇప్పుడు గ్రేటర్ పరిధిలోనే పెద్ద ఎత్తున చేరికలు జరుగుతుండడం జనసేనకు కలిసి వచ్చే అంశం.
తాజాగా వికారాబాద్ చెందిన లాయర్ జగదీష్, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ అనసూయ, శైలజ వంటి విద్యాధికులతోపాటు ఆర్థిక స్థితి మంతులు జనసేనలో చేరారు. మున్ముందు మరింత మంది జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
* సెటిలర్స్ ఆసక్తి..
ఆంధ్రమూలాలు ఉన్న సెటిలర్స్ జనసేన లో చేరేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలామంది స్థిరపడ్డారు. అటువంటి వారు ఇప్పుడు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో సెంటిమెంట్ సన్నగిల్లింది. అభివృద్ధితోపాటు ఇతర రాజకీయ అంశాల ప్రభావం ఉంది. అందుకే ఎక్కువ మంది రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారు. ప్రధానంగా ఆంధ్రమూలాలు ఉన్నవారు జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. ఏపీలో ఆ పార్టీ అధికారంలో ఉండడం కూడా కలిసి వచ్చే అంశం. పైగా గ్రేటర్ ఎన్నికల్లో బిజెపి అలయన్స్ లో జనసేన ఉంటుందన్న అభిప్రాయంతో.. అటువైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. మున్ముందు మరిన్ని చేరికలు పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా చేరుతున్నారు. ఏపీ రాజకీయాలతో సంబంధం ఉండి.. హైదరాబాదులో స్థిరపడిన ప్రముఖ కుటుంబాలు జనసేనలోకి వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నాయి.