AP Politics: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. సహజంగానే ఏపీ రాజకీయాలలో కులాల పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. ఎన్నికల సమయంలో ఇవి ఎక్కువ ప్రభావం చూపిస్తుంటాయి.
2024 లో జరిగిన ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో జనసేన, బిజెపి, టిడిపి కలిసి పోటీ చేశాయి. కూటమిగా ఏర్పడి అధికారాన్ని దక్కించుకున్నాయి. మూడు పార్టీలకు కూటమి ప్రభుత్వంలో సముచిత ప్రాధాన్యం లభించింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఏపీ అభివృద్ధి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో మూడు పార్టీలకు తన ప్రాధాన్యం దక్కే విధంగా ఆయన అడుగులు వేస్తున్నారు.
మూడు పార్టీల అధినాయకులు ఎన్నికల్లో సముచిత ప్రాధాన్యం ఉండే విధంగా ఆలోచనలు చేస్తుంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి మరో విధంగా ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు.. మిగతా నాయకులు వేరే విధంగా వ్యవహరిస్తున్నారు. వైసిపికి లాభం చేకూర్చే విధంగా మాట్లాడుతున్నారు. సహజంగానే ఇలాంటి అవకాశం కోసం వైసిపి ఎదురుచూస్తూ ఉంటుంది. పైగా ఆ పార్టీ చేతిలో మీడియా ఉంది. అందువల్లే జనసేన, టిడిపి, బిజెపి లో దిగువ స్థాయి నాయకుల అసంతృప్తి వ్యాఖ్యలకు విపరీతమైన ప్రాధాన్యం ఇస్తూ ఉంది. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రజల్లో నాయకులు చులకన అవుతారు. కానీ ఆ విషయం కూటమిలోని పార్టీల కిందిస్థాయి నాయకులకు అర్థం కావడం లేదు.
జనసేన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు
తాజాగా జనసేన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్థానిక ఎన్నికల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన గెలిచిన చోట టిడిపి వాళ్ళను గౌరవిస్తున్నామని.. టిడిపి వాళ్ళు గెలిచిన చోట జనసేన నాయకులను గౌరవించడం లేదని.. ఈ సమస్య మీద నేరుగా ఒకే చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతామని శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు. గడచిన కొంతకాలంగా కార్యకర్తల బాధ చూశామని.. ఇకపై వారు బాధపడకుండా చూసుకుంటామని శ్రీనివాస్ పేర్కొన్నారు. కార్యకర్తల ప్రవర్తన ఆధారంగా టికెట్లు కేటాయిస్తామని.. స్థానిక ఎన్నికల్లో గెలిపించుకునే బాధ్యతను భుజాలకు ఎత్తుకుంటామని శ్రీనివాస్ హామీ ఇచ్చారు.
ఇటువంటి వ్యాఖ్యలను అంతర్గతంగా చేసుకోవాలి
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇటువంటి వ్యాఖ్యలను అంతర్గతంగా చేసుకోవాలి. సాధారణంగా ఒక కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి.. సానుకూల ధోరణిలో మాట్లాడుతూ ఉంటే ఆ సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి. కూటమిగా ఉన్న మూడు పార్టీలలో కూడా సమస్యలు లేవని కాదు. కాకపోతే వాటిని సానుకూల దృక్పథంతో చర్చించుకుంటే బాగుంటుంది. అలాకాకుండా ఇలా అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే సమస్యలు వెలుగు చూస్తూనే ఉంటాయి. ఇక్కడ జనసేన నాయకులకు టిడిపి ఎమ్మెల్యేలు గౌరవం ఇవ్వాలి. వాళ్ల సమస్యలను పరిష్కరించుకోవాలి. ఏదైనా ఉంటే కలిసి మాట్లాడుకోవాలి. అలాకాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుంది. స్థానిక ఎన్నికల సమయంలో ఇటువంటి ధోరణి కొనసాగిస్తే కూటమికి మొదటికే మోసం వస్తుంది.