Jana Sena Party : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. రిజర్వేషన్లు.. ఇతరత్రా వ్యవహారాలలో అధికారులు తీవ్రంగా తలమనుకలయ్యారు. ఈ ప్రకారం చూసుకుంటే స్వల్ప కాలంలోనే ఏపీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాకపోతే విడతలవారీగా ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సున్నితమైన ప్రాంతాలలో బందోబస్తు పకడ్బందీగా నిర్వహించి.. ఎన్నికల క్రతువును పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
2024 లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని వార్తలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. ఇక్కడ పార్టీలకంటే వ్యక్తులకు ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుంది. పైగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కులాలు.. ప్రాంతాలు అనే లెక్కల ఆధారంగా సాగుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూటమిలో మూడు పార్టీలకు ఇది ఒక రకంగా సవాలు.
సీట్ల భర్తీ.. అభ్యర్థుల ఎంపిక.. ఇవన్నీ పకడ్బందీగా జరగాలి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే అలా అనిపించడం లేదు. ఇటీవల ఏపీ మంత్రి నారా లోకేష్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల కేటాయింపుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనకు 15 శాతం సీట్లు ఇస్తామని ఆయన పరోక్షంగా చెప్పారు. అప్పటినుంచి జనసేన నాయకుల్లో టెన్షన్ మొదలైంది. పైగా ఇటీవల జనసేన నాయకులు ఆత్మగౌరవం పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. చివరికి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టిడిపి దయ మీద బతకాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ కూడా నాయకుల మాటలతో ఏకీభవించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వాటా కోసం గట్టిగానే పోరాటం చేస్తామని నాయకులకు సంకేతాలు ఇచ్చారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినట్టుగానే స్థానిక సంస్థల్లో కూడా జరుగుతుందా అని జనసేన నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి టీడీపీ నాయకులు జోరు మీద ఉన్నారు. వారి జోరు కాస్త తగ్గితేనే తమకు వెసలు బాటు ఉంటుందని జనసేన నాయకులు అంటున్నారు.. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు.. వచ్చే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. సీట్ల సర్దుబాటు ఎలా జరుగుతుంది.. అనేవి అత్యంత కీలకం కాబోతున్నాయి. అంతర్గతంగా జరుగుతున్న ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి వైసిపి సిద్ధంగా ఉంది. కాకపోతే ఆ పార్టీకి అంత సీన్ ఉంటుందా.. అనేది ఇక్కడ అసలైన ప్రశ్న. ఎందుకంటే ఏపీలో 2024 ఎన్నికల్లో కూటమికి 151 స్థానాలు వచ్చాయి. వైసిపికి చాలాచోట్ల బలమైన నాయకత్వం లేదు. 2024 ఎన్నికల్లో ఫలితాల తర్వాత చాలామంది నాయకులు సైలెంట్ అయిపోయారు. అందువల్లే స్థానిక సంస్థల్లో కూడా 2024 నాటి ఫలితాలు వస్తాయని వైసీపీలో కొంతమంది నాయకులు చర్చించుకోవడం విశేషం.