Chintakayala Vijay: తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్లు చాలామంది ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న వారు ఉన్నారు. అటువంటి వారిలో ముందు వరుసలో ఉంటుంది చింతకాయల కుటుంబం. అయ్యన్నపాత్రుడు టిడిపి ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు. సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఆయన ఎన్నడు పార్టీని వదలలేదు. పైగా పార్టీ పట్ల పూర్తి విధేయతతో వ్యవహరిస్తూ వస్తున్నారు. అందుకే చంద్రబాబు చింతకాయల కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యమిస్తూ వచ్చారు. ప్రస్తుతం అయ్యన్నపాత్రుడు అసెంబ్లీ స్పీకర్ గా ఉండగా.. ఆయన కుమారుడు విజయ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు పక్కకు తప్పుకొని.. మరో కుమారుడు రాజేష్ కు లైన్ క్లియర్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం ఖాయం అన్న ప్రచారం నడుస్తోంది. అయితే మొన్నటి రాజ్యసభ ఎంపిక విషయంలో అయ్యన్నపాత్రుడి కుమారుడు పేరును పరిగణలోకి తీసుకోవడం వెనుక భారీ వ్యూహం ఉంది. అవ్యుహాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నారు ఎంపీ విజయ్. ఏకంగా రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి కేసుల విషయాన్ని ప్రస్తావించి సంచలనం సృష్టించారు విజయ్.
* పార్లమెంట్ సమావేశాలు..
ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన చింతకాయల విజయ్ తన ప్రతాపాన్ని చూపుతున్నారు. మంచి వాగ్దాటితో జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి ప్రత్యేక ప్రస్తావన తీసుకొచ్చారు. 13 చార్ట్ సీట్లు, 31 కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి అంటూ దర్యాప్తు సంస్థల తీరుపై ప్రశ్నలు వర్షం కురిపించారు విజయ్. ప్రజాస్వామ్యానికి జగన్మోహన్ రెడ్డి లాంటి వారు హానికరం అంటూ తేల్చేశారు. అందుకే ఆయన కేసుల విషయంలో విచారణను వేగవంతం చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. చాలాసేపు రాజ్యసభలో తన వాదనలు వినిపిస్తూ.. జగన్మోహన్ రెడ్డి అక్రమ అరెస్టుల గురించి విరుచుకుపడ్డారు. అయితే రాజ్యసభలో చింతకాయల విజయ్ గురించి ఎక్కువమంది ఆరా తీసినట్లు కూడా తెలుస్తోంది.
* దాని వెనుక భారీ వ్యూహం..
వాస్తవానికి రాజ్యసభ సభ్యుడిగా చింతకాయల రాజేష్ ఎంపిక వెనుక భారీ వ్యూహం ఉంది. తండ్రి అయ్యన్నపాత్రుడు మాదిరిగా దూకుడు కలిగిన నేత విజయ్. గతంలో చాలా సందర్భాల్లో విజయ్ విశ్వరూపం చూసాం. అయితే తెలుగుదేశంలో రాజ్యసభ పదవులు పొందిన వారు తర్వాత కాలంలో ఆ పార్టీకి దూరం కావడం.. ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం అనేది ఒక సెంటిమెంట్ గా మారింది. దానిని బ్రేక్ చేసేలా ఉన్నారు విజయ్. ఇప్పటికే లోక్సభలో కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీ భరత్ లాంటి వారు ఉన్నారు. మహిళా ఎంపీగా బైరెడ్డి శబరి గట్టిగానే రాణిస్తున్నారు. అందుకే రాజ్యసభలో చింతకాయల విజయ్ లాంటి వారిని పంపించి జాతీయ రాజకీయాలు అనుకూలంగా మార్చుకోవాలని చంద్రబాబుతో పాటు లోకేష్ భావించారు. అయితే ఇప్పుడు ఏకంగా రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి పాత కేసుల గురించి ప్రస్తావిస్తూ విజయ్ సుదీర్ఘ సమయం కేటాయించడం అందర్నీ ఆకట్టుకుంటుంది.