real estate crisis హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బిల్డర్ల లెక్కలు చూస్తుంటే సామాన్యుడికి ఒళ్ళు మండిపోవడం కాదు.. నేరుగా గుండె ఆగిపోయేలా ఉంది.. ఐటీ విస్తరించింది.. ఫ్లైఓవర్లు వచ్చాయి.. చివరకు కాంక్రీట్ అడవి కూడా తయారైంది. కానీ, జీతం పుచ్చుకునే ఉద్యోగి సొంతింటి కల మాత్రం అంగారక గ్రహంపై ప్లాటు కొనేంత దూరంలోకి వెళ్ళిపోయింది. తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వ్యాపారుల ‘కోట్ల ఫాంటసీ’పై పిడుగు లాంటి సత్యాలను కురిపించడంతో ఈ రియల్ బెలూన్ గాలి కాస్త బుస్సుమంది!
లక్ష జీతం ఉన్నోడా.. నువ్వు కోటి బిల్డర్‌కు బానిసవి!
నెలకు ఏకంగా లక్ష రూపాయల జీతం తెచ్చుకుంటున్నానని తెగ మురిసిపోతున్నారా? అయ్యో పాపం.. హైదరాబాద్‌లో ఒక రెండు పడకల గది ఫ్లాట్ కొంటే.. మీ జీవితకాల సంపాదన అంతా బిల్డర్ జేబులోకి.. బ్యాంకు ఈఎమ్‌ఐల ఖాతాలోకి హారతి కర్పూరంలా వెళ్ళిపోవాల్సిందే. చదువు, పిల్లల పెళ్లిళ్లు, మెడికల్ ఎమర్జెన్సీలు.. ఇవన్నీ పక్కనపెట్టి, కేవలం గాలి పీల్చుకుంటూ బతికేసి, ఉన్నదంతా కడితే తప్ప హైదరాబాద్‌లో ఓ చిన్న గూడు మీ సొంతం కాదు.. పదేళ్ల తర్వాత పెరిగే భూమి ధరను ఇప్పుడే బిల్లు చేసి, కొంటే కొను లేకపోతే పో అని గీత దాటడం ఏ రకం వ్యాపారమో ఆ దేవుడికే తెలియాలి.
కాగితంపై రూ.200 కోట్లు.. తీరా చూస్తే ఖాళీ ప్లాట్లు
ఏదో ఒక మూలన ఎకరం భూమిని రూ.200 కోట్లకు కొనేసి ఆ పెట్టుబడిని రాబట్టడానికి ప్రతి ప్లాటుపై కోట్ల భారాన్ని రుద్దేస్తే.. జనాలు కొనేస్తారా? “కాగితం మీద రాసుకునే రేటు వేరు, జనం జేబులో ఉండే నోటు వేరు!” అని రంగనాథ్ గారు క్లాస్ పీకేసరికి రియల్ టైకూన్లకు కాస్త చెమటలు పట్టాయి. జనాలు పీకల్లోతు అప్పులు చేసి, జీవితాంతం బానిసలుగా బతికేకంటే చల్లగా “అద్దె ఇంట్లోనే ఉంటాం సామీ” అని చేతులెత్తేస్తున్నారు.
సవాల్ ఎదురైతే తప్ప కళ్ళు తెరవరూ!
అభివృద్ధి ఉంటే ధరలు పెరగడం సహజమే.. కానీ దానికి కొనుగోలు శక్తికి అసలు సంబంధమే లేకపోతే అది వికాసం కాదు.. వీధి పోరాటం.. ధరలు ఆకాశాన్ని తాకితే, కొనుగోళ్లు పాతాళానికి పడిపోవడం ఖాయం. కోట్ల కలల వ్యాపారానికి “వాస్తవం” అనే హైదరాబాద్ సామాన్యుడి జేబు గట్టి చెక్ పెడుతోంది.
మరి ఇప్పటికైనా మన బిల్డర్లు గాల్లోంచి కిందకి దిగి, మనుషులు కొనే రేట్లకు దిగొస్తారో లేక ఖాళీ అపార్ట్‌మెంట్లకు కాపలాదారులుగా మిగిలిపోతారో చూడాలి!