YS Jagan: స్థానిక ఎన్నికల్లో గెలవాలని.. మెజారిటీ స్థానాలు సొంతం చేసుకోవాలని.. కూటమికి గట్టి గుణపాఠం చెప్పాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ నాయకులతో కీలకంగా సమావేశాలు జరుపుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా దాదాపు అందరి నాయకులకు జగన్ అపాయింట్మెంట్ ఇస్తున్నారు. వారితో మాట్లాడుతున్నారు.
జగన్ ప్రణాళిక ఒక విధంగా ఉంటే.. క్షేత్రస్థాయిలో మరో విధంగా జరుగుతోంది. ఇటీవల విజయనగరం జిల్లాలో వైసిపి కీలక నేత, బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీను వైసీపీ నుంచి టిడిపిలో చేరారు. ఉత్తరాంధ్రలో గట్టి పట్టు ఉన్న నాయకుడిగా శ్రీనుకు పేరు ఉంది. అటువంటి నాయకుడు టిడిపిలో చేరడం ఒకరకంగా స్థానిక ఎన్నికలకు ముందు వైసీపీకి అది గట్టి దెబ్బ..
మజ్జి శ్రీను పార్టీని వీడి వెళ్లడాన్ని మర్చిపోకముందే.. గోదావరి జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ పదవుల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. త్వరలోనే ఆయన డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకుపోబోతున్నట్లు తెలుస్తోంది.. ప్రతిపాడు నియోజకవర్గంలో సుబ్బారావు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. పైగా ఈయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి.. 2014లో వైసిపి నుంచి శాసనసభకు ఎంపికయ్యారు. 2024 ఎన్నికల్లో మాత్రం వైసిపి నుంచి ఓడిపోయారు. జనసేనలో చేరడం పట్ల ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. వారి అభిప్రాయం తీసుకున్నారు.
సుబ్బారావు ఏలేశ్వరం.. ప్రతిపాడు.. రౌతులపూడి.. శంఖవరం మండలాల్లో గట్టిపట్టు ఉంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో వరపుల సత్యప్రభ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం ఇస్తున్నారు. ఇప్పుడు సుబ్బారావు పార్టీలో చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో నియోజకవర్గంలో సమీకరణాలు ఒక్కసారిగా మారే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల సమయంలో ఇది వైసీపీకి పెద్ద షాక్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలో వైసిపికి ఒక్క సీటు కూడా రాలేదు. స్థానిక ఎన్నికల్లో పోయిన పరువు ను నిలబెట్టుకోవాలని వైసిపి ప్రయత్నాలు చేస్తుంటే.. ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఇలా రాజీనామా చేయడం కార్యకర్తలకు.. అధినాయకత్వానికి మింగుడు పడడం లేదు. సుబ్బారావు రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ నియోజకవర్గానికి ఎవరిని సమన్వయకర్తగా నియమిస్తారో ఇంకా జగన్ ప్రకటించలేదు.