Janasena: స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా జరగలేదు. కానీ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వైసిపి కూటమిలో విచ్ఛిన్నకరమైన వాతావరణం ఏర్పడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సొంత మీడియాలో.. సోషల్ మీడియాలో రకరకాల వార్తలు రాస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన కూటమిలో ఒక పార్టీగా ఉంది. నాడు 21 సీట్లలో పోటీ చేసింది. అన్ని సీట్లలో గెలిచి, 100% స్ట్రైక్ రేట్ సాధించింది. తద్వారా జాతీయ రాజకీయాల్లోనే సరికొత్త సంచలనానికి నాంది పలికింది. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రస్తావించారు. ఇప్పుడు ఇదే ఫార్మేట్లో స్థానిక ఎన్నికల్లో కూడా గెలిచే స్థానాలలోనే జనసేన పోటీ చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన కాకినాడ సమావేశంలో కార్యకర్తలకు క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఇన్ని రోజులపాటు జరుగుతున్న ఊహాగానాలకు పవన్ కళ్యాణ్ చెక్ పెట్టినట్టు తెలుస్తోంది.
అన్ని స్థానాల్లో పోటీ చేసి.. కొన్ని స్థానాలలో ఓడిపోవడం కంటే.. గెలిచే స్థానాల్లో మాత్రమే పోటీ చేయడం వల్ల పార్టీ కి ఉన్న ఇమేజ్ పెరుగుతుందని.. కూటమిలో కూడా సఖ్యత వాతావరణం ఏర్పడుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందువల్లే కార్యకర్తలకు ఆయన ముందుగానే దిశా నిర్దేశం చేసినట్టు తెలుస్తోంది.. స్థానిక ఎన్నికల్లో కీలకమైన కార్పొరేషన్లను.. మున్సిపాలిటీలను గెలుచుకోవాలని జనసేన భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీతో తెర వెనుక చర్చలు జరుపుతోంది. అయితే ఇందులో ఏ స్థాయిలో పురోగతి సాధ్యమవుతుందో తెలియడం లేదు.
మరోవైపు స్థానిక ఎన్నికల్లో కూడా 100% స్ట్రైక్ రేట్ సాధించాలని పవన్ కళ్యాణ్ పిలుపునివ్వడం కార్యకర్తల్లో సరికొత్త ఉత్సాహం నింపుతోంది. అయితే ఇటీవల కాలంలో ఓ సమావేశంలో నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల్లో పొత్తులేంటని ప్రశ్నించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం స్థానిక ఎన్నికల్లో పార్టీ అనుసరించే విధానాన్ని పకడ్బందీగా చెప్పేశారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో జనసేన బలంగా ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతాలలో మాత్రమే పోటీ చేస్తుందని.. గెలిచే స్థానాలలో మాత్రమే నిలబడుతుందని ఒక క్లారిటీ వచ్చింది. దీంతో ఎన్ని రోజులపాటు జనసేన కార్యకర్తల్లో నెలకొన్న అనుమానాలు.. సందేహాలు ఒక్కసారిగా నివృతి అయ్యాయి. పవన్ కేరళ నుంచి వచ్చిన తర్వాత స్థానిక ఎన్నికల గురించే మాట్లాడటం..కార్యకర్తలతో చర్చించడం..వంటి పరిణామాలు స్థానిక ఎన్నికల పట్ల పవన్ నిబద్ధతను తేటతెల్లం చేస్తున్నాయి.