Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలకు తరలింపు ప్రక్రియ కొలిక్కి వస్తోంది. ఆ మహత్తర ప్రాజెక్టు చివరి దశకు చేరుకుంది. ఉత్తరాంధ్రకు గోదావరి జిల్లాలు మరింత దూరంలోనూ లేవు. ప్రధానంగా విశాఖ, అనకాపల్లి జిల్లాలకు జీవనది గోదావరి జిల్లాలు తరలిరానున్నాయి. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా సాగునీటితో పాటు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం భగీరథ ప్రయత్నం చేసింది. ఆ పనులు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి. దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన ఎడమ కాలువ కలను క్షేత్రస్థాయిలోకి తెచ్చింది కూటమి ప్రభుత్వం. యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించింది. గోదావరి పరవలను ఉత్తరాంధ్ర సరిహద్దులను చేర్చడంలో రాష్ట్ర జలవనరుల శాఖ విజయవంతం అయింది. మరి కొద్ది రోజుల్లోనే ఉత్తరాంధ్రకు పూర్తిస్థాయిలో తాకనున్నాయి గోదావరి జలాలు.
* కూటమి వచ్చిన తర్వాత..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ఎడమ కాలువ విస్తరణ పై దృష్టి పెట్టింది. పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి అధికార యంత్రాంగం తో పాటు జలవనరుల శాఖ తీవ్ర స్థాయిలో శ్రమించాయి. గతంలో భూసేకరణ సమస్యలు, ప్యాకేజీల వివాదాలు, కాలువ లైనింగ్, క్రాస్ డ్రైనేజ్ పనుల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను అమలు చేసింది. నిలిచిపోయిన స్ట్రక్చర్లు, డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తూ.. నీటి ప్రవాహానికి మార్గం సుగమం చేసింది. నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది పగలు రాత్రి శ్రమించి కాలువను జల ప్రవాహానికి సిద్ధం చేశారు.
* చంద్రబాబు చేతుల మీదుగా..
పోలవరం ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి పనులు కొలిక్కి రావడంతో.. సెప్టెంబర్ మొదటి వారంలో చంద్రబాబు చేతుల మీదుగా నీటి విడుదలకు నిర్ణయించారు. ఈ నీటి రాకతో ఉత్తరాంధ్రలోని పాయకరావుపేట నియోజకవర్గం తో పాటు అనకాపల్లి, విశాఖ జిల్లాలో చాలా ప్రాంతాలకు సాగునీరు లభించనుంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఎగువ ప్రాంతాల నుంచి నీటి లభ్యత తగ్గడంతో తరచూ తాండవ, వరాహ, శారదా నది పరివాహక ప్రాంతాలు గోదావరి జలాలతో జలకళ సంతరించుకొనున్నాయి. ఫలితంగా ఆయా నదుల పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు, కాలువలు నిండి భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి అయితే ఉత్తరాంధ్రకు ఇదో కొత్త మైలురాయి అని చెప్పవచ్చు.