West Bengal Politics : కమ్యూనిస్టుల సుదీర్ఘ పాలనకు ముగింపు.. మమతా బెనర్జీ ప్రభుత్వానికీ గుడ్‌బై
2026లో బీజేపీ అధికారంలోకి రావడంతో బెంగాల్ రాజకీయ, సాంస్కృతిక వాతావరణంలో మార్పు
పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో 2026 సంవత్సరం ఒక కీలక మలుపుగా నిలిచింది. దశాబ్దాలపాటు కమ్యూనిస్టుల ఆధిపత్యాన్ని చూసిన బెంగాల్.. ఆ తర్వాత మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పాలనకు మారింది. ఇప్పుడు ఆ రెండు దశలను దాటి తొలిసారిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలు గెలుచుకోగా.. తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాలకే పరిమితమైంది. దీంతో 2011 నుంచి కొనసాగిన మమతా బెనర్జీ పాలనకు తెరపడింది. బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన సువేందు అధికారి మే 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
34 ఏళ్ల కమ్యూనిస్టు పాలన నుంచి..
1977లో బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన వామపక్ష కూటమి సుమారు 34 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించింది. గ్రామీణ రాజకీయాల నుంచి విద్యా, సాహిత్య, సాంస్కృతిక రంగాల వరకు వామపక్ష భావజాల ప్రభావం బలంగా ఉండేదనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో ఉంది.
2011లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఆ ఆధిపత్యానికి తెరదించింది. అయితే అధికార మార్పు జరిగినప్పటికీ.. బెంగాల్‌లోని మేధో, సాంస్కృతిక వ్యవస్థల్లో వామపక్ష ప్రభావం పూర్తిగా తొలగిపోలేదన్న విమర్శలు కొనసాగాయి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంతో ఆ పరిస్థితిలో కూడా మార్పు వస్తుందా? అనే చర్చ మొదలైంది.
రాజకీయ మార్పు.. సాంస్కృతిక మార్పునకు దారితీస్తుందా?
బెంగాల్ చరిత్రలోనే సంస్కృతి, సాహిత్యం, కళలు, మేధో చర్చలకు ప్రత్యేక స్థానం ఉంది. భారత స్వాతంత్ర్యోద్యమంలోనూ బెంగాల్ కీలక పాత్ర పోషించింది. రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, బంకిమ్ చంద్ర ఛటర్జీ వంటి మహనీయుల ఆలోచనలు బెంగాల్ సామాజిక చైతన్యంపై గాఢమైన ముద్ర వేశాయి.
అయితే స్వాతంత్ర్యం తర్వాతి రాజకీయ పరిణామాల్లో వామపక్ష భావజాలం బెంగాల్ సామాజిక, సాంస్కృతిక జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిందన్న వాదన ఉంది. విశ్వవిద్యాలయాలు, సాహిత్య వేదికలు, మేధో సంస్థలు, మీడియా వంటి రంగాల్లో ఆ ప్రభావం కనిపించేదని బీజేపీ, దాని అనుకూల వర్గాలు చాలాకాలంగా ఆరోపిస్తున్నాయి.
మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ సాంస్కృతిక వ్యవస్థలో పెద్దగా మార్పు రాలేదన్న విమర్శలు వినిపించాయి.
ఇప్పుడు ‘సాంస్కృతిక జాతీయవాదం’ చర్చ
బీజేపీ అధికారంలోకి రావడంతో బెంగాల్‌లో మరో రకమైన రాజకీయ చర్చ మొదలైంది. పాలనలో మార్పుతో పాటు రాష్ట్ర సాంస్కృతిక గుర్తింపును కూడా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది.
ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం బెంగాల్ చరిత్ర, భారతీయ సంస్కృతి, జాతీయవాద భావనలకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతోంది. తాజాగా ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను బీజేపీ వర్గాలు ‘సాంస్కృతిక పునరుజ్జీవనం’గా అభివర్ణిస్తున్నాయి.
పేర్ల మార్పు, చారిత్రక వ్యక్తులకు సంబంధించిన గుర్తులను పునరుద్ధరించడం, దేవాలయాలు–ఆధ్యాత్మిక ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు ఈ మార్పులో భాగంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బెంగాల్ ప్రభుత్వం సాంస్కృతిక, ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు.
బెంగాల్‌లో కొత్త భావజాల పోరు?
అందుకే బెంగాల్‌లో జరుగుతున్నది కేవలం అధికార మార్పు మాత్రమే కాదని ఒక వర్గం విశ్లేషిస్తోంది. రాజకీయ అధికారంతో పాటు రాష్ట్ర సాంస్కృతిక, మేధో వాతావరణంలోనూ మార్పు తీసుకురావాలన్న ప్రయత్నం మొదలైందని ఆ వర్గం భావిస్తోంది.
ఇది ఎంతవరకు ప్రజల్లో ఆమోదం పొందుతుంది? వామపక్ష–తృణమూల్ ప్రభావంతో దశాబ్దాలుగా కొనసాగిన సాంస్కృతిక ధోరణి ఎంతవరకు మారుతుంది? బీజేపీ ప్రతిపాదిస్తున్న ‘సాంస్కృతిక జాతీయవాదం’ బెంగాల్ రాజకీయాలను ఏ మేరకు ప్రభావితం చేస్తుంది? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.
ఒకప్పుడు కమ్యూనిస్టు కంచుకోటగా ఉన్న బెంగాల్.. ఆ తర్వాత మమతా బెనర్జీకి బలమైన రాజకీయ స్థావరంగా మారింది. ఇప్పుడు అదే బెంగాల్ తొలిసారి బీజేపీకి అధికారం అప్పగించింది. దీంతో బెంగాల్‌లో రాజకీయ మార్పు మాత్రమే కాదు.. సాంస్కృతిక దిశలోనూ కొత్త అధ్యాయం మొదలైందా? అన్న చర్చ దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సాంస్కృతిక జాతీయవాదం దిశగా బెంగాల్ సమాజం సాగుతున్న మార్పుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.