Loan Guarantor : నేటి కాలంలో బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం పెరిగిపోయింది. అయితే కొన్ని రుణాలకు గ్యారెంటీ లేదా షూరిటీ సంతకం అవసరం ఉంటుంది. ఇలాంటి సమయంలో కొందరు తమ స్నేహితులు, బంధువుల కోసం షూరిటీ సైన్ చేస్తుంటారు. అయితే ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఎందుకంటే లోన్ తీసుకున్న వ్యక్తి సరైన విధంగా ఈఎంఐ చెల్లించకపోతే ఆ భారం షూరిటీ ఇచ్చిన వ్యక్తిపై పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా షూరిటీ ఇచ్చిన వ్యక్తి క్రెడిట్ స్కోర్ కూడా తగ్గే ప్రమాదం ఉంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక బ్యాంకు లేదా సంస్థ ఒక వ్యక్తికి రుణం ఇచ్చేటప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన మరో వ్యక్తి ని హామీగా తీసుకుంటారు. రుణ గ్రహీత సక్రమంగా రుణం చెల్లించలేని స్థితిలో ఉంటే ఈ గ్యారెంటర్ ను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఒప్పందంలోని నిబంధనల ప్రకారం రుణ గ్రహీత రుణాన్ని చెల్లించ లేకపోతే గ్యారంటర్ ఆ బాధ్యత వహించాల్సి రావచ్చు. అంటే తాను లోన్ తీసుకోకపోయినా కూడా దానికి బాధ్యుడు కావచ్చు.
ఒకవేళ రుణం తీసుకున్న వ్యక్తి ఈఎంఐ చెల్లించడం మిస్ అయినా.. లేదా నిర్లక్ష్యం చేసినా.. అప్పు ఇచ్చిన సంస్థలు రుణ గ్రహీతను కాకుండా గ్యారెంటర్ ను బాధ్యులుగా చేస్తారు. భారతీయ కాంట్రాక్టు చట్టంలోని సెక్షన్ 128 ప్రకారం గ్యారెంటర్ ఈ బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా రుణ గ్రహీత కు సంబంధించిన లోన్ కు ఈ గ్యారెంటర్ ప్రత్యేకంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది.
అయితే చాలామందికి తెలియని మరో విషయం ఏంటంటే ఇలా గ్యారెంటీ సైన్ చేసిన వారి క్రెడిట్ స్కోర్ పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక లోన్ కు సంబంధించి షూరిటీ సంతకం చేస్తే.. ఇది ఆన్లైన్లో నమోదయి ఉంటుంది. అప్పుడు రుణ గ్రహీత చెల్లింపులు చేయకపోతే ఆ ప్రభావం షూరిటీ ఇచ్చిన వ్యక్తిపై పడి.. అతని ప్రొఫైల్ ను చెక్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ షూరిటీ ఇచ్చిన వ్యక్తి భవిష్యత్తులో కార్ లోన్ లేదా పర్సనల్ లోన్ తీసుకోవాల్సి వస్తే క్రెడిట్ హిస్టరీని చెక్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఈ షూరిటీ విషయం బయటకు వస్తే అప్పుడు లోన్ ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా తక్కువ వడ్డీతో వచ్చే లోన్స్ పై కూడా ఈ ప్రభావం పడుతుంది.