Polavaram Project : ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ తీరబోతోంది. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు సాగునీరు అందనుంది. సెప్టెంబర్ మొదటి వారంలో ఏపీ సీఎం చంద్రబాబు చేతులమీదుగా గోదావరి జిల్లాలకు హారతి ఇవ్వనున్నారు. దీనికి ముందుగా ట్రయల్ రన్ నిర్వహించారు. కొంత దూరం నీరు వదిలారు. ఎడమ కాలువలు 67వ కిలోమీటర్ దగ్గర రెగ్యులేటర్ వరకు తీసుకువచ్చి ఆపారు. 111వ కిలోమీటర్ వరకు ట్రయల్ రన్ పూర్తి చేయనున్నారు. అక్కడినుంచి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నీరు వదిలే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఉత్తరాంధ్ర వాసులకు గోదావరి జలాలు పాకుతుండడం శుభపరిణామం.
* మొదటి వారంలోనే..
పోలవరం ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి గోదావరి నీటికి హారతి పేరుతో కార్యక్రమాన్ని సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గోదావరి వరద జలాలు పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల పథకాల ద్వారా ఎడమ కాలువ నుంచి అనకాపల్లి వరకు ఇవ్వాలని ప్రణాళిక రూపొందించారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు ఎడమ కాలువ ద్వారా తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాల మీదుగా ఉత్తరాంధ్ర వరకు తాకుతాయి. తొలి దశలో భాగంగా ఇప్పుడు అనకాపల్లికి గోదావరి జలాలను విడిచిపెట్టి దీనిని మరింత దగ్గర చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత ట్వీట్ చేశారు. పోలవరం ఎడమ కాలు ద్వారా నీటి విడుదల ఉత్తరాంధ్ర రైతాంగానికి ఒక చారిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించారు. సెప్టెంబర్ మొదటి వారంలో జరగనున్న జలహారతి కార్యక్రమానికి ముఖ్య మంత్రి చంద్రబాబు హాజరవుతారని ప్రకటించారు.
* వేడుకగా జరపాలని..
మరోవైపు క్షేత్రస్థాయిలో గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు తాకడాన్ని ఒక వేడుకగా జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు సారిపల్లిపాలెంలో హోం మంత్రి ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఘనస్వాగత ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం సీతారాంపురం – పి ఎల్ పురం దగ్గర జలహారతి ఇవ్వనున్నారు. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరితే తాగు, సాగునీటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. చిరకాల వాంఛ తీరనుంది.