Ganesh Laddu Auction: రాజేంద్రనగర్ ప్రాంతంలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసే గణపతికి విశేషమైన చరిత్ర ఉంటుంది. ఈ ప్రాంతంలో గణపతి లడ్డును కనివిని ఎరుగని రీతిలో వేలం వేస్తారు. దానికి రికార్డు స్థాయిలో డబ్బులు వస్తాయి.. గత ఏడాది ఈ ప్రాంతంలో గణపతి లడ్డును వేలం వేసి, 2.31 కోట్లకు కొనుగోలు చేశారు.
కోట్లు చెల్లించడం వెనక
గణపతి లడ్డుకు కోట్లు చెల్లించడం వెనుక సామాజిక కోణం ఉంది. ప్రతి ఏడాది ఇక్కడ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు నాలుగు గ్రూపులుగా ఏర్పడతారు. వారంతా కూడా వేలంలో పాల్గొంటారు.. వేలంలో లడ్డును కొనుగోలు చేసిన తర్వాత.. ఆ లడ్డును వారు ప్రసాదం మాదిరిగా పంచుకుంటారు. వచ్చిన డబ్బును సామాజిక సేవ కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. వాస్తవానికి బయటి నుంచి చూస్తే అది కేవలం ఐదు కిలోల లేదా 10 కిలోల లడ్డుకు ఆ స్థాయిలో వేలం ఎందుకు అనిపిస్తుంది. కానీ అసలు ఉద్దేశం వేరే ఉంది. అంత భారీ ధరకు లడ్డును కొనుగోలు చేసి తినడం అనేది ముఖ్య ఉద్దేశం కాదు. భక్తిని చూపించడం.. కమ్యూనిటీలో పోటీ చూపించడం.. దాతృత్వం ప్రదర్శించడం అనేవి దీని వెనుక ఉన్న కారణాలు.
అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు
కీర్తి రిచ్మండ్ విల్లాస్ ప్రాంతంలో ఐటి.. ఫార్మా.. ఇతర విభాగాలలో పనిచేసేవారు ఉంటారు. వీరంతా కూడా భారీగా డబ్బు ఉన్నవాళ్లే. వీరంతా కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు. అందువల్లే గణపతి నిమజ్జనం రోజు నిర్వహించే గణపతి లడ్డును రికార్డు స్థాయిలో వేలంలో దక్కించుకుంటారు. ఆ తర్వాత వచ్చిన డబ్బును సామాజిక సేవ కార్యక్రమాలకు వినియోగిస్తారు. 2023లో ఇక్కడ లడ్డు వేలం ద్వారా వచ్చిన డబ్బును వృద్ధాశ్రమాలు.. అనాధ పిల్లలు.. ఆరోగ్యం.. విద్య వంటి సామాజిక కార్యక్రమాలకు ఖర్చు చేశారు. ఈ ఏడాది నిర్వహించిన లడ్డువేలంలో శక్తిమాన్ గ్రూప్ ఏకంగా 1.1 కోట్లకు సొంతం చేసుకుంది. గత ఏడాది ఇక్కడి లడ్డును నిర్వాహకులు 2.31 కోట్లకు దక్కించుకోవడం విశేషం. ప్రతి ఏడాది నాలుగు గ్రూపులు లాగా విడిపోయే కమ్యూనిటీ వాసులు.. లడ్డు వేలం పాట పాడుతారు. దానిని రికార్డు స్థాయిలో ధరకు పాడి.. కోట్లకు దక్కించుకుంటారు. వాస్తవానికి లడ్డు కొనుగోలు అనేది కేవలం ఒక భక్తి భావన మాత్రమే. వచ్చిన డబ్బుతో సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. అందువల్లే కీర్తి రిచ్మండ్ విల్లాస్ నిర్వహించే లడ్డువేలానికి విపరీతమైన ప్రాధాన్యం ఉంటుంది. 2023 నుంచి ఇక్కడ లడ్డు కోట్లలో పలుకుతోంది.
ప్రజల మన్ననలు పొందారు
లడ్డు వేలంపాటను చాలామంది వేరే విధంగా చూస్తారు. కాని దానిని కీర్తి రిచ్మండ్ విల్లాస్ వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే తనకు భక్తి ఎక్కువ అని.. అదే సమయంలో సామాజిక సేవ భావన కూడా అధికమని వారు చెబుతుంటారు. దానివల్లే లడ్డును రికార్డు స్థాయి ధరకు కొనుగోలు చేస్తామని.. డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేసి.. సమీప గ్రామాలు లేదా సమీప ప్రాంతాలలో సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెబుతున్నారు. వృద్ధాశ్రమాలు.. అనాధ ఆశ్రమాలు.. చదువుకోవాలని ఉండే పిల్లలకు ఆర్థిక సహకారం అందిస్తారు. ప్రతి పైసాకు ఇక్కడ లెక్క ఉంటుంది. ఒక్క రూపాయి కూడా దుబారా చేయరు.. పైగా ఇక్కడ కమ్యూనిటీ ఆధ్వర్యంలో అనేక సందర్భాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించి.. సమీప ప్రాంతాల ప్రజల మన్ననలు పొందారు.