Thiruparankundram: తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లాలో ఉన్న తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక మహా దీపం వెలిగించే అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొండపై ఉన్న దీపత్తూణ్ (రాతి స్తంభం) వద్ద దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీనికి తోడు భద్రతపరమైన ఆంక్షలు విధించడంతో మధురైలో ఉత్కంఠ ఏర్పడింది.
నవంబర్ 20న సుప్రీంకోర్టు జస్టిస్ అరవింద్ కుమార్.. జస్టిస్ విపుల్ తో కూడిన బెంచ్ కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది నవంబర్ 24న తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న రాతి మహా స్తంభం వద్ద కార్తిక మహాదీపం వెలిగించడానికి ఒక్కసారి మాత్రమే అవకాశం కల్పించింది. అయితే ఈ అనుమతి భవిష్యత్తులో అక్కడ దీపం వెలిగించే హక్కును కల్పించదని.. సంప్రదాయానికి సంబంధించిన చివరి నిర్ణయంగా భావించరాదని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో సాధారణ ప్రజలకు అనుమతి ఉండదు. దేవస్థానం తరఫున అధికారికంగా ఎంపిక చేసిన పరిమిత బృందం మాత్రమే ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో దీపం వెలిగించాలి. మధురై జిల్లా కలెక్టర్ ఏర్పాట్లకు నోడల్ అధికారిగా వ్యవహరించాలి. ఆలయ కార్య నిర్వహణ అధికారి.. పురావస్తు శాఖ అధికారులు.. పోలీస్ కమిషనర్ తో సంప్రదించి బృందం సభ్యుల సంఖ్య కార్యక్రమం సమయం.. మార్గాన్ని నిర్ణయించాలి. ఊరేగింపు.. బహిరంగ సమావేశాలు.. నినాదాలు.. నిరసనలకు అనుమతి లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
. సుప్రీంకోర్టు ఇచ్చిన మద్యంతర ఉత్తరులను సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వ దేవాదాయ శాఖ కమిషనర్ నవంబర్ 21న రివ్యూ పిటిషన్ వేశారు. నవంబర్ 22న ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తుది విచారణ పూర్తికాకముందే పిటిషనర్లు కోరిన ప్రధాన వివరాలను మభ్యంతర దశలోనే కల్పించడం సరికాదని ప్రభుత్వం అభ్యంతర వ్యక్తం చేసింది.
రాతి స్తంభం వద్ద దీపం వెలిగించేందుకు అనుమతి ఇస్తే శాంతి భద్రతల సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది. దశాబ్దాలుగా ఉన్న పిల్లయర్ ఆలయ సమీపంలో సాంప్రదాయ దీప మండపంలోనే కార్తీక దీపం వెలిగిస్తున్నారని.. కొండపై ఉన్న రాతి స్తంభ కేవలం సర్వే గుర్తు మాత్రమేనని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. అయితే ఈ రివ్యూ పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఇంకా విచారణ సాగించాల్సి ఉంది.
మహాదీపం వెలిగించే కార్యక్రమం నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మధురై జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంది. నవంబర్ 23 నుంచి కలెక్టర్ నిషేధ ఆజ్ఞలు విధించారు. దీని ప్రకారం బహిరంగ సమావేశాలు.. నిరసనలు.. ఊరేగింపులు.. ఆందోళనలపై నిషేధం విధించారు. కొండపైకి సాధారణ ప్రజలు వెళ్లడాన్ని నిలిపివేశారు. ఈ నిషేధ ఆజ్ఞలు సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి.
తిరుప్పరం కుండ్రం దీప వివాదం ఇప్పుడు న్యాయపరమైన అంశాన్ని దాటి రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. సుప్రీంకోర్టు ఆదేశాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని బిజెపి నేతలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. మరోవైపు శాంతి భద్రతలను కాపాడాల్సిన బాద్యత తమ మీద ఉందని ప్రభుత్వం వాదిస్తోంది. దీనికి తోడు సుబ్రమణ్య స్వామి ఆలయంలో సాంప్రదాయ విధానంలో సాయంత్రం కార్తిక మహాదీపం వెలిగించబోతున్నారు. ఇదే సమయంలో సుప్రీంకోర్టు అనుమతించిన దీపస్తంభం వద్ద కూడా పరిమిత బృందంతో దీపం వెలిగిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇది విజయ్ ప్రభుత్వానికి ఒక సవాల్ గా మారింది.