Botsa Satyanarayana: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి తన పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. పుంజుకునే ప్రయత్నంలో ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో దూకుడుగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా కొన్ని జిల్లాలపై ఫోకస్ పెట్టింది. పెద్ద నేతలు ఉన్నచోట స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించాలని చూస్తోంది. అందులో భాగంగా విజయనగరంలో బొత్స ఫ్యామిలీకి కీలక బాధ్యతలు అప్పగించింది. జిల్లా పరిషత్తోపాటు మెజారిటీ ఎంపీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్ పోస్టులు కైవసం చేసుకోవాలని టాస్క్ ఇచ్చింది. ప్రధాన నేతలు ఉన్నచోట స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటితే ఆ ప్రభావం మిగతా ప్రాంతాల్లో ఉంటుంది. అయితే ఇప్పుడు బొత్స పగడ్బందీగా విజయనగరం జిల్లాలో రంగంలోకి దిగుతున్నారు. తన కుటుంబ సభ్యులనే ప్రయోగిస్తున్నారు.
* జిల్లా అంతటా కుటుంబ హవా..
సాధారణంగా విజయనగరం జిల్లా అంటేనే బొత్స అడ్డా. కేవలం ఆయన ఒక్కరు మాత్రమే కాదు. ఆ కుటుంబం నుంచి ఏకంగా నలుగురు ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చేవారు. బొత్స చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రాతినిధ్యం వహించేవారు. ఆయన సోదరుడు బొత్స అప్పల నరసయ్య గజపతినగరం ఎమ్మెల్యేగా ఉండేవారు. విజయనగరం ఎంపీగా ఆయన భార్య బొత్స ఝాన్సీ లక్ష్మీ ప్రాతినిధ్యం వహించేవారు. నెల్లిమర్ల నుంచి సమీప బంధువు అప్పలనాయుడు ఎమ్మెల్యేగా ఉండేవారు. మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు జిల్లా పరిషత్ చైర్మన్గా వ్యవహరించేవారు. ఇలా ఎటు చూసినా బొత్స ఫ్యామిలీ కనిపించేది విజయనగరంలో. అంతలా హవా చాటుకుంది ఆ కుటుంబం. అటువంటి కుటుంబానికి 2024 ఎన్నికల్లో బ్రేక్ పడింది. ఒక్కచోట కూడా ఆ కుటుంబ సభ్యులు గెలవలేదు.
* జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా..
అయితే బొత్స బలమైన నేత కావడంతో జగన్మోహన్ రెడ్డి విశాఖ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మండలిలో వైసీపీ పక్ష నేతగా క్యాబినెట్ హోదా కట్టబెట్టారు. అటువంటి జగన్ అడిగేసరికి విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు బొత్స. అందులో భాగంగా జడ్పిటిసి గా తన కుమార్తె అనూషను నిలబెట్టాలని చూస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి పై ఫోకస్ పెట్టారు. జిల్లా పరిషత్తుకు సంబంధించి చైర్మన్ పదవి కోసం జడ్పిటిసి లను గెలిపించుకునే బాధ్యతలను తీసుకున్నారు. తద్వారా మెజారిటీ మండలాల ఎంపీపీలను సైతం కైవసం చేసుకునేందుకు చూస్తున్నారు. మరి ఆయన ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.