AP Rains: ఏపీలో తీవ్ర వర్షాభావం కొనసాగుతోంది. మధ్య మధ్యలో వాయు గుండాలు, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. కానీ అవి ఆశాజనకంగా పడటం లేదు. దీంతో రైతులకు ఖరీఫ్ కష్టాలు తప్పడం లేదు. ఇటువంటి తరుణంలో బంగాళాఖాతం నుంచి ఒక అలర్ట్ వచ్చింది. ఉత్తర బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు దూరంగా ఒక అల్పపీడనం ఏర్పడినట్లు తేలుస్తోంది. రాగల 12 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా మారి.. 24 గంటల్లో వాయుగుండం గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మన రాష్ట్రంపై ప్రభావం అంతంతమాత్రంగా ఉంటుందని చెబుతూనే.. ఈనెల 18 వరకు కోస్తాంధ్ర, యానంతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని చెప్పుకొస్తోంది.
* ఆ రెండు రాష్ట్రాలపై అధికం..
ఈ వాయుగుండం ప్రభావం ప్రధానంగా పశ్చిమ బెంగాల్ తో పాటు ఒడిస్సా పై ఉంటుంది. ప్రధానంగా గంగా నది పరివాహక ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు పడతాయని చెబుతోంది వాతావరణ శాఖ. కోస్తాంధ్రలో మాత్రం ఈనెల 18 వరకు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు ఈరోజు తో పాటు రేపు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. కనీసం ఈ వాయుగుండంతో వర్షాలు పడితే ఖరీఫ్ ముందుకు సాగుతుందని ఆశతో ఉన్నారు రైతులు. ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకోవైపు రుతుపవనాల విస్తరణ కూడా ఆలస్యం జరుగుతోంది. కనీసం ఈ వాయుగుండం ప్రభావంతో నైనా రుతుపవనాల్లో కదలిక వస్తుందన్న ఆశలు పెట్టుకున్నారు రైతులు.
* రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు..
గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వర్షం పడింది. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లిలో 43.8 మిల్లీమీటర్లు, కురుపాంలో 38.6, పార్వతీపురంలో 36.8.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో 33.4, పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో 32.6, పార్వతీపురం మన్యం జిల్లా బాలాజీ పేటలో 28.6, పాలకొండలో 28.6, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 28, పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలసలో 25.8, ఏలూరు జిల్లా భీమడోలు 18.4, శ్రీకాకుళం జిల్లా పలాసలో 18.4, కర్నూలు జిల్లా గూడూరులో 15.6, నంద్యాల జిల్లా డోన్ లో 12.6, కర్నూలు జిల్లా హొలిగొందలో 11, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.