Andhra Pradesh Weather: ఏపీకి వర్ష సూచన వచ్చింది. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండం గా మారింది. భూభాగం పై దూసుకు వస్తోంది. పచ్చిమ బెంగాల్ కు చేరువలో.. ఒడిస్సా కు వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం క్రమేపి బలపడుతోంది. తీరం వైపు దూసుకొస్తోంది. దీంతో ఆ రెండు రాష్ట్రాలతో పాటు ఏపీకి వర్ష సూచన చేసింది భారత వాతావరణ శాఖ. ప్రధానంగా ఏపీలో ఉత్తరాంధ్రలో ఈరోజు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సైతం కీలక సూచనలు చేసింది. కొన్ని జిల్లాలకు వర్ష సూచన చేస్తూనే.. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని.. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది.
* ఈ జిల్లాల్లో వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఈరోజు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం తో పాటు అనకాపల్లి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉంటుంది. మరోవైపు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన తొమ్మిది మంది మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లి రాలేదు. దీంతో ఆయా కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. అందుకే ఉత్తరాంధ్ర ప్రాంతంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని.. ఈదురు గాలులు వీస్తున్న దృష్ట్యా తీరానికే పరిమితం కావాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది.
* ఆ రాష్ట్రాలపై ప్రభావం..
ఈ భారీ వాయుగుండం ప్రభావం ఏపీ కంటే ఒడిస్సా పైనే అధికంగా ఉండనుంది. ఒకవేళ ఇది దిశ మార్చుకొని ఏపీ వైపు వస్తే మాత్రం భారీగా వర్షాలు నమోదయ్య చాన్స్ ఉంటుంది. ఇప్పటికే తీవ్ర వర్షాభావం నెలకొంది. వర్షాలు సకాలంలో పడక ఖరీఫ్ పనులు మందగించాయి. మరోవైపు దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. అదే సమయంలో బంగాళాఖాతంలో వాయు గుండాలు, ఆవర్తనాలు ఏర్పడుతుండడం హర్షించదగ్గ పరిణామం. మరో రెండు రోజులపాటు ఉత్తరాంధ్రలో ఇలా చెదురు మధురు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, రైతు కూలీలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది.