Srikalahasti Police: నడిరోడ్డు పైనే హెడ్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకోవడమే కాకుండా కత్తితో బెదిరించాడు. కనీసం పోలీసులన్న భయం లేకుండా ఆ యువకుడు హెడ్ కానిస్టేబుల్ పై దూసుకొచ్చిన విధానం భయం గొలిపింది. అనుచితంగా ప్రవర్తించడమే కాదు ఏకంగా దాడికి ప్రయత్నం చేశాడు. సోషల్ మీడియాలో ఇది వెలుగు చూడడంతో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. సదరు యువకుడికి పోలీసులు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. శ్రీకాళహస్తిలో ఈ ఘటన జరిగింది. ప్రధాన మార్కెట్లో హెడ్ కానిస్టేబుల్ రమణయ్య పై ఇద్దరు యువకులు దాడికి ప్రయత్నించారు. రోడ్డుపై గొడవకు దిగి ఆయన చొక్కా పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న యువకుడికి పోలీసులు తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. చేతికి సంకెళ్లు వేసి.. పట్టణ వీధుల్లో నడిపించుకుంటూ కోర్టులో హాజరు పరిచారు.
* రోడ్డు ప్రమాదం చేసి..
ఈనెల 11న సాయంత్రం వేళల్లో హెడ్ కానిస్టేబుల్ రమణయ్య వీధుల్లో ఉన్నారు. ఆ సమయంలో దారిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనను గమనించారు. వెంటనే స్పందించి ప్రమాదంలో గాయపడిన మహిళను ఆటోలో ఆసుపత్రికి పంపించారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు రోడ్డుపై ఉన్న స్కూటీని పక్కకు తీశారు. ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనానికి సంబంధించి తాళాలు తీసుకున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన శ్రీనివాసులు, జితేంద్ర అనే యువకులను పోలీస్ స్టేషన్కు రావాలని సూచించారు. దీంతో ఒక్కసారిగా ఆ యువకులు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ రమణయ్య పై తిరగబడ్డారు.
* ఏకంగా కత్తితో దాడి..
ఇంతలో యువకుల్లో ఒకరైన శ్రీనివాసులు ఏకంగా హెడ్ కానిస్టేబుల్ రమణయ్య చొక్కా పట్టుకుని.. కత్తితో దాడి చేసే ప్రయత్నం చేశాడు. అయితే హెడ్ కానిస్టేబుల్ అప్రమత్తమై తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తక్షణం నిందితులను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. చివరకు ఇద్దరినీ అరెస్ట్ చేసి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు శ్రీనివాసులపై గతంలో అనేక కేసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉండేందుకు శ్రీనివాసులను శ్రీకాళహస్తి పట్టణ వీధుల గుండా నడిపించుకుంటూ తీసుకెళ్లి కోర్టులో హాజరు పరిచారు. విధుల్లో ఉన్న పోలీసులపై దాడులకు పాల్పడితే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూపించారు.
View this post on Instagram