Balakrishna: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా శ్రీమంతులు ఉండే కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ రద్దీ విపరీతమవుతోంది. ఈ నేపథ్యంలో కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న రహదారులను విస్తరించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఏక మార్గ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాదు పార్కు చుట్టూ ఉన్న చెట్లను కొట్టివేసింది. అండర్ పాసులు నిర్మించాలని నిర్ణయించుకుంది.
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. వీటి నిర్మాణం ద్వారా పెద్ద పెద్ద వ్యక్తుల ఇళ్ళు రోడ్డు వైండింగ్లో వెళ్లిపోతున్నాయి. వారి ప్రయోజనాల కోసం ఈ పనులను నిలిపి వేశారని ఆరోపణలు వచ్చాయి. సర్కార్ ఇండికేషన్లు కూడా వాటికి తగ్గట్టుగా ఉండడంతోనే విమర్శలు మరింత పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే చిక్కుల్లో పడిన రేవంత్ ప్రభుత్వానికి నందమూరి బాలకృష్ణ ఉపశమనం కలిగించారు. కేబీఆర్ పార్క్ పక్కనే ఉన్న తన ఇంటికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.
బంజారాహిల్స్.. జూబ్లీహిల్స్ ప్రాంతాల నుంచి కేబుల్ బ్రిడ్జి.. దుర్గం చెరువు వైపు వెళ్లే వాహనాలకు ఇబ్బందులు ఉండకుండా ఉండేందుకు జంక్షన్లు అభివృద్ధి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పనులు సాఫీగా జరగడానికి. రోడ్డు విస్తరణ మెరుగ్గా ఉండడానికి నందమూరి బాలకృష్ణ తన సొంత ఇంటిలో దాదాపు 862.77 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వానికి ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. పెద్ద పెద్ద వ్యక్తుల అసెట్స్ పోతున్న నేపథ్యంలోని ఈ వర్కులను ఆపివేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో బాలకృష్ణ తీసుకున్న నిర్ణయం అటు రాజకీయ వర్గాల్లో. ఇటు సినీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ప్రజలకు ప్రయోజనం కలిగించే విషయాలే దానికి ముఖ్యమని బాలకృష్ణ ఈ నిర్ణయం ద్వారా మరోసారి నిరూపించారు. ఈ పనుల వల్ల బాలకృష్ణ నివాసంలోనే ఒక ప్రధాన భవనంలో సగానికి పైగా వైండింగ్లో వెళ్లిపోతుంది. అయితే ఈ ఇంట్లో ఉండకుండా.. బాలకృష్ణ వేరే ఇంట్లోకి షిఫ్ట్ అవుతారని తెలుస్తోంది.
నందమూరి బాలకృష్ణకు ఈ ఇంటితో విడదీయరాని అనుబంధం ఉంది. 1982లో సీనియర్ ఎన్టీఆర్ స్వయంగా బాలకృష్ణ కోసం ఈ ఇంటిని నిర్మించి ఇచ్చారు. దశాబ్దాలుగా ఎన్నో వేడుకలకు ఈ ఇల్లు ఒక వేదికలాగా నిలిచింది. సీనియర్ ఎన్టీఆర్ స్వయంగా ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చారు. తన వెల్ విషర్లను, ఫ్యాన్స్ ను కలిశారు. ఎన్నో జ్ఞాపకాలు.. అనుబంధాలు ముడిపడి ఉన్న ఈ ఇంటిని బాలకృష్ణ వదులుకోవడం ఒకరకంగా బాధాకరమైనప్పటికీ.. ప్రజల ప్రయోజనాల కోసం ఆయన ఏదైనా చేస్తారు అనడానికి ఇది నిదర్శనం.
తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఒక 1,090 కోట్ల అంచనాతో ఎలివేటెడ్ కారిడార్.. జంక్షన్ ల విస్తరణ చేపడుతోంది. ఈ విస్తరణలో భాగంగా భవ్య కన్స్ట్రక్షన్స్.. శబ్దాలుయ స్టూడియో వంటి సంస్థలు కూడా తమ స్థలాలను ప్రభుత్వానికి ఇవ్వడానికి ముందుకు వచ్చాయి.. పెద్ద వ్యక్తులు ఈ ప్రాజెక్టు కోసం తమ భూములు ఇవ్వడానికి ముందుకు రావడం శుభ సూచకమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మిగతావారు కూడా ముందుకు వస్తే పనులు వేగంగా సాగుతాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.