AP BJP: ఏపీ పై ఫుల్ ఫోకస్ పెట్టింది భారతీయ జనతా పార్టీ. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విశాఖకు చేరుకున్నారు. ఈరోజు పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 945 మండలాల నుంచి బాధ్యులు హాజరుకానున్నారు. ఒకవైపు కూటమి ధర్మాన్ని పాటిస్తూనే ఒంటరిగా ఎదగాలన్నది బిజెపి ప్రణాళికగా తెలుస్తోంది. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల పై ఫుల్ ఫోకస్ పెట్టింది. తెలుగు రాష్ట్రాల బలంతోనే కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ. ఏపీలో కూటమిపరంగా 21 పార్లమెంట్ సీట్లు.. బిజెపి సొంతంగా మూడు స్థానాల్లో విజయం సాధించింది. అయితే టిడిపి, జనసేనతో పోల్చుకుంటే భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు అంతంత మాత్రం అన్న విమర్శలు ఉన్నాయి. ఈ తరుణంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్ర పర్యటనకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
* పెద్దపెద్ద నాయకులు ఉన్నా…
ఏపీలో భారతీయ జనతా పార్టీలో హేమాహేమీలైన నాయకులు ఉన్నారు. పార్టీలో సీనియర్లు సైతం కొనసాగుతున్నారు. అయినా సరే పార్టీ ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లడం లేదు. ముఖ్యంగా పార్టీలో సీనియర్ల మధ్య సమన్వయం అంతంత మాత్రమేనని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ ఉన్నారు. తాజాగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలుగా పురందేశ్వరి, ఉపాధ్యక్షుడిగా రామ్ మాధవ్ ఎన్నికయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి లోనే కొనసాగుతున్నారు. రాష్ట్ర మంత్రిగా సత్య కుమార్ యాదవ్, కేంద్ర సహాయ మంత్రిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బిజెపి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎం రమేష్ తో పాటు సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి ఇలాంటి సీనియర్లు ఉన్నారు.. కానీ ఆశించిన స్థాయిలో బిజెపి బలపడడం లేదు. అందుకే బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ దిశా నిర్దేశం చేస్తారని తెలుస్తోంది.
* స్థానిక ఎన్నికలపై చర్చ..
ప్రాంతాలవారీగా బిజెపి బలపడేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక వర్గ పరంగా, యువత పరంగా ఈసారి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. పార్టీలో సమూల ప్రక్షాళన తీసుకొచ్చి సొంతంగా ఎదగాలని అజెండాతో బిజెపి ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు కూటమిపరంగా రెండు పార్టీలతో మైత్రి కొనసాగిస్తూనే.. ఇంకోవైపు రాజకీయంగా బలపడాలన్న కోణంలో బిజెపి ముందుకు వెళ్తోంది. ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో కూడా బిజెపి వైఖరి మారింది. ఆ పార్టీ నేతలు స్ట్రాంగ్ గా ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఇవన్నీ స్థానిక సంస్థల ఎన్నికల కోసమేనని స్పష్టమవుతోంది. విశాఖలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. మొత్తానికి అయితే ఏపీపై బీజేపీ ఫోకస్ పెట్టడం నిజంగా శుభ పరిణామమే..