Amaravati Development: అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2028 నాటికి తొలిదశ పనులు పూర్తి చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇటీవల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం నాడు చంద్రబాబు ఇదే విషయాన్ని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతిని ఒక ఉత్సవ వాతావరణం లో ప్రారంభింప చేస్తామని ప్రకటన చేశారు. అయితే దేశంలోనే ఒక చారిత్రాత్మక మైలురాయిని అధిగమించేందుకు అమరావతి సిద్ధమవుతోంది. భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి పోల్ ఫ్రీ నగరంగా అవతరించనుంది. ఎక్కడ విద్యుత్ స్తంభాలు కానీ.. వైర్లు కానీ లేకుండా నగరాన్ని తీర్చిదిద్దుతున్నారు. దేశంలో ఏ నగరానికి లేని ఈ సరికొత్త హంగు అమరావతికి దక్కనుండడం నిజంగా శుభ పరిణామం.
* వాటితో నగరాలకు సమస్య..
సాధారణంగా నగరవీధులు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, ఇంటర్నెట్ ఫైబర్ కేబుళ్లతో నిండిపోతుంది. ఇక తాగునీటికి సంబంధించిన పైపులైన్లు, మురుగునీటి ప్రవాహానికి సంబంధించిన కాలువలు.. ఇలా ప్రతి ఒక్కటి బయటకు కనిపిస్తూ నగరీకరణకు హాని చేస్తుంటాయి. దేశంలో ఏ నగరం చూసిన ఇలానే కనిపిస్తూ ఉంటాయి. అయితే కొత్తగా నిర్మితమవుతున్న అమరావతి నగరంలో మాత్రం ఇటువంటిదేమీ లేకుండా.. అంతా అండర్ గ్రౌండ్ నెట్వర్క్ ద్వారానే నిర్వహించనున్నారు. ఆకాశంలో కనిపించే గజిబిజి కేబుల్స్, ప్రమాదకరమైన విద్యుత్ స్తంభాలు లేని ఒక స్వచ్ఛమైన, సుందరమైన భవిష్యత్తు నగరంగా అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
* ప్రత్యేక ప్రణాళిక..
ఈ పోల్ ఫ్రీ అంటే చిన్న విషయం కాదు. ప్రత్యేక ప్రణాళిక ద్వారా మాత్రమే ఇది సాధ్యం. ఇది కేవలం బాహ్య సౌందర్యానికే పరిమితం కాకుండా.. ఆధునిక శైలి, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే బలమైన మౌలిక వస్తువుల కల్పనకు వీలు కల్పిస్తుంది. తీర ప్రాంతానికి సమీపంలో ఉండే ఏపీలో తుఫానులతో పాటు ఈదురు గాలులు, భారీ వర్షాల ముప్పు ఎక్కువ. ఇలాంటివి సంభవించినప్పుడు రోజుల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, సమాచార వ్యవస్థ స్పందించడం వంటివి జరుగుతుంటాయి. కానీ ఈ అండర్ గ్రౌండ్ ప్రాజెక్టు వల్ల ఎలాంటి విపత్తులు వచ్చినా అమరావతి నగరం తట్టుకోగలదు.
* చురుగ్గా పనులు..
ప్రస్తుతం అమరావతిలో యుటిలిటీ డక్ట్స్,, అండర్ గ్రౌండ్ టన్నెల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ లైన్లు, కమ్యూనికేషన్ కేబుళ్లు, మంచినీటి పైపులైన్లు, డ్రైనేజీ రోడ్ల కింద సురక్షితంగా వేరుచేసి నిర్మిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఏదైనా మరమ్మత్తులు, లేకుంటే కొత్త కేబుల్స్ వేయాల్సి వస్తే.. ప్రతిసారి రోడ్లను తవ్వాల్సిన అవసరం లేదు. రవాణాకు ఆటంకం కలగకుండా ఉండేలా ఈ అండర్ గ్రౌండ్ డక్ట్ సిస్టంను రూపొందించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజా భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ మౌలిక వసతులు కల్పిస్తున్నారు. అత్యాధునిక భూగర్భ వసతుల వల్ల అమరావతి నగరం క్లీన్ అండ్ గ్రీన్ గా జాతీయస్థాయిలో సరికొత్త ఒరవడిని సృష్టించనుంది.