Amaravati Signature Bridge: అమరావతి విషయంలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అమరావతికి, విజయవాడకు మధ్య రవాణాకు సంబంధించి ఒక కీలక ప్రాజెక్టు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసే పనిలో పడింది. ప్రకాశం బ్యారేజీ వద్ద ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ కృష్ణా నదిపై అంతర్జాతీయ ప్రమాణాలతో రూ. 1000 కోట్ల వ్యయ అంచనాలతో ప్రతిష్టాత్మకంగా సిగ్నేచర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. ఈ మేరకు డిపిఆర్ తయారీకి ప్రభుత్వం ప్రాథమికంగా అడుగులు వేస్తోంది. ఈ ప్రతిపాదిత సిగ్నేచర్ వంతెనను విజయవాడ ప్రకాశం బ్యారేజీ, రైల్వే వంతెనల మధ్య ప్రాంతంలో నిర్మించేలా ప్రణాళికలు రచిస్తున్నారు.
* అమరావతికి అత్యుత్తమ కనెక్టివిటీ..
ఇదేదో రవాణా మార్గం కాకుండా.. ఆకర్షణీయంగా రూపొందించాలి అనేది ప్రభుత్వ ఆలోచన. సుమారు 1.10 కిలోమీటర్ల పొడవున, ఆరు లేన్ల రహదారితో ఈ వంతెన నిర్మాణం జరగనుంది. ఇది విజయవాడ నగరం తో పాటు సీడ్ యాక్సిస్ రోడ్డు ద్వారా అమరావతికి అత్యుత్తమ కనెక్టివిటీని అందించి.. భవిష్యత్తులో పెరగబోయే ట్రాఫిక్ అవసరాలకు శాశ్వత పరిష్కార మార్గంగా నిలవనుంది. ఈ బ్రిడ్జిని కేవలం రవాణా వ్యవస్థ కోసమే కాకుండా.. రాజధాని అమరావతికి ఒక ఐకానిక్ ల్యాండ్ మార్కుగా, పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దనున్నారు. ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
* ప్రత్యేక ఆకర్షణగా..
ఆరు లేన్లగా వచ్చే రహదారి వంతెనకు ఇరువైపులా కాలినడకన వెళ్లే వారికోసం ఫుట్ పాత్ లు, పర్యావరణహిత ప్రయాణాన్ని ప్రోత్సహించేలా ప్రత్యేక సైకిల్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నారు. నది అందాలను తిలకించేలా ఆధునిక లైటింగ్, ప్రత్యేక వ్యూ పాయింట్లతో ఈ వంతెనను డిజైన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ పై ట్రాఫిక్ ఒత్తిడి తీవ్రంగా ఉంది. కృష్ణా నదిపై రూపుదిద్దుకోబోతున్న ఈ మౌలిక వసతుల ప్రాజెక్టు.. ఏపీ రవాణా రంగానికి కొత్త ఊపిరి పోయనుంది. పర్యాటక రంగానికి పెద్ద పీట వేస్తూ.. అమరావతి అభివృద్ధి ప్రస్థానంలో మరొక ప్రతిష్టాత్మకమైన కట్టడం గా.. ఈ సిగ్నేచర్ బ్రిడ్జి నిలవనుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కచ్చితంగా ఇది అమరావతి కీర్తి ప్రతీకగా నిలవనుంది.