YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి డీఎస్సీ- 2025 పై అనుమానాలు వ్యక్తం చేశారు. దానిని ఒక దగా డిఎస్సి గా పేర్కొన్నారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు చోటు చూసుకున్నాయని ఆరోపించారు. గత ఏడాది కూటమి ప్రభుత్వం 16,400 ఉపాధ్యాయ పోస్టులతో డీఎస్సీ నియామక ప్రక్రియను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది నియామకం జరిగి ఒక విద్యా సంవత్సరంలో విద్యాబోధన కూడా పూర్తి చేశారు సదరు ఉపాధ్యాయులు. ఇప్పుడు అదే డీఎస్సీ నియామక ప్రక్రియ పై ఆరోపణలు చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. దీంతో ఆ 16 వేల మందికి పైగా ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తీరును తప్పు పడుతున్నారు. ఆయన స్థాయికి తగిన ఆరోపణలు కావని తేల్చి చెబుతున్నారు.
* ఎన్నికల ముందు హడావిడిగా..
2024 ఎన్నికల కు ముందు రోజుల వ్యవధిలో 6000 ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చింది జగన్ ప్రభుత్వం. కానీ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం కాలేదు. ఇంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. దీంతో డీఎస్సీ నోటిఫికేషన్ రద్దయింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 6000 ఉపాధ్యాయ పోస్టులకు తోడు.. మరో 10,000 కలిపి 16 వేల పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించింది చంద్రబాబు సర్కార్. దానికి కూడా అడ్డు తగిలింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. లేనిపోని కేసులు కూడా మోపింది. లీగల్ పరంగా ఎటువంటి అడ్డంకులు ఎదురైనా నివృత్తి చేసుకొని ముందుకు సాగారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. అనుకున్న వ్యవధిలోనే 16 వేల ఉపాధ్యాయ పోస్టుల నియామకాలను పూర్తి చేశారు. అయితే ఇప్పుడు ఆ నియామకాలు అక్రమ పద్ధతిలో జరిపారని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దీంతో ఉపాధ్యాయులుగా ఎంపికైన 16000 మంది తీవ్ర ఆందోళనతో ఉన్నారు.
* నిరాశలో నిరుద్యోగులు…
2019 ఎన్నికలకు ముందు ఏటా డీఎస్సీ ప్రకటించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఉపాధ్యాయ పోస్ట్పై ఆశలు పెట్టుకున్న చాలామంది నిరుద్యోగులు బీఈడీతో పాటు డీఎడ్ పూర్తి చేశారు. కానీ ఎటువంటి భర్తీ లేకపోవడంతో నిరాశ చెందారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 16 వేల పోస్టులు భర్తీ చేయడంతో చాలామంది ఉద్యోగాలు పొందారు. కానీ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో ఓ వార్తను పట్టుకొని.. డీఎస్సీలో అవకతవకలు జరిగాయి అంటూ ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఏపీ విద్యాశాఖ ఫ్యాక్ట్ చెక్ లో భాగంగా ఆ ఆరోపణల్లో నిజం లేదని తెలిపింది. దీంతో ఈ ఉపాధ్యాయులంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ తన రాజకీయాల కోసం తమ జీవితాలను పణంగా పెట్టడాన్ని మాత్రం సహించుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి తీరును అసహ్యించుకుంటున్నారు. 16 వేల కుటుంబాలు నేరుగా వైసీపీకి దూరమైనట్టే. అయితే దాని ప్రభావం ఇంకా రెట్టింపు ఉంటుంది. అనవసరంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మూల్యం చెల్లించుకోబోతోంది.
