AP Academic Instructor Jobs: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు చేపట్టింది. అందులో భాగంగా స్కూళ్లలో టీచర్ల కొరత తీర్చేందుకు ముందుకు వచ్చింది. గత ఏడాది మాదిరిగా ఈసారి కూడా ప్రభుత్వ స్కూళ్లలో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలని ప్రతిపాదించింది. మేరకు ఏపీ ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు పంపించింది. రాష్ట్రవ్యాప్తంగా 6534 మంది అవసరం ఉందని ఈ ప్రతిపాదనలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వీరందరి నియామకం జరగనుంది. గత ఏడాది కూడా వీరి నియామకం చేపట్టింది. ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న తరుణంలో.. వీలైనంత త్వరగా మరోసారి వీరి నియామకం చేపట్టాలని చూస్తోంది.
* గత ఏడాది కంటే పెరిగిన పోస్టులు..
ఈ అకడమిక్ ఇన్స్ట్రక్టర్లకు సంబంధించి.. స్కూల్ అసిస్టెంట్లు అయితే నెలకు రూ.12,500… ఎస్జీటీలు అయితే నెలకు రూ.10,000 చొప్పున వేతనాలు చెల్లించనున్నారు. గత ఏడాది 1146 మంది ఇన్స్ట్రక్టర్ ల నియామకం జరగగా.. ఈ ఏడాది మాత్రం పోస్టుల సంఖ్య పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలల సంఖ్య పెంచడంతో పాటు హైస్కూల్లో సబ్జెక్టు టీచర్ల కొరత కారణంగా.. వీరి అవసరం భారీగా పెరిగింది. గతంలో పనిచేసిన చాలామంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. అదే స్థాయిలో రిటైర్ అయిన వారు ఉన్నారు. అయితే బదిలీల్లో భాగంగా చాలామందికి స్థానచలనం కలిగింది. కానీ ఇంతవరకు రిలీవ్ చేయలేదు. అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకాలు పూర్తయ్యాక వీరిని రిలీవ్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.
* మెరిట్ ఆధారంగా ఎంపిక..
స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి ఇన్స్ట్రక్టర్ అయితే 12,500 రూపాయల వేతనం అందనుంది. సెకండరీ గ్రేడ్ టీచర్లకు సంబంధించి ఇన్స్ట్రక్టర్లు అయితే 10 వేల రూపాయల చొప్పున వేతనంగా అందించనున్నారు. సొంత గ్రామంతో పాటు మండలానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మెరిట్ ఆధారంగా వీరిని ఎంపిక చేస్తారు.. అకడమిక్ కు 75%, ప్రొఫెషనల్ అర్హతలకు 25 శాతం చొప్పున వెయిటేజీ ఇచ్చారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆరు జిల్లాలకు ఇన్చార్జి డిఈఓ లను నియమించింది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ప్రకాశం, అనంతపురం జిల్లాలకు డీఈఓ లను నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.