YouTube monetization : కొత్తగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి, దాని ద్వారా ఆదాయం పొందాలని చూస్తున్న క్రియేటర్లకు భారీ షాక్ తగిలినట్లయింది. ఈ ప్లాట్ ఫాం మీదికి రావడానికి కావాల్సిన అర్హత ప్రమాణాలను యూట్యూబ్ మరింత కఠినతరం చేసింది. 2027 ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఈ రూల్స్ ప్రకారం చూస్తే.. మానిటైజేషన్ చాలా కష్టతరమే అనిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
వాచ్ టైమ్ డబుల్:
ప్రస్తుతం యూట్యూబ్ లో యాడ్ రెవెన్యూ కోసం అప్లై చేయాలంటే 12 నెలల్లో 4,000 గంటల చెల్లుబాటు అయ్యే పబ్లిక్ వాచ్‌టైమ్ సాధించాలి. కానీ ఇప్పుడు దీనిని మార్చారు. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే వాచ్‌టైమ్ లక్ష్యం 8,000 గంటలకు పెరుగుతుంది. అంటే కొత్త క్రియేటర్లు మానిటైజేషన్‌కు అర్హత పొందేందుకు గతంలో కంటే రెండింతలు వాచ్‌టైమ్ సాధించాల్సి ఉంటుంది.
షార్ట్స్ క్రియేటర్లకూ భారీ టార్గెట్
షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ పొందాలనుకునే క్రియేటర్లకు కూడా భారీ టార్గెట్ సాధించాలి. ప్రస్తుతం 90 రోజుల్లో10 మిలియన్ల( 1 కోటి) చెల్లుబాటు అయ్యే పబ్లిక్ వ్యూస్ సాధించాలి. కానీ 2027 ఫిబ్రవరి నుంచి ఈ సంఖ్య 20 మిలియన్లు ఉండాలి. అంటే కేవలం కొన్ని వైరల్ షార్ట్స్ మాత్రమే మానిటైజేషన్ కు అవకాశం ఉంటుంది. అయితే సబ్‌స్క్రైబర్ల విషయంలో మాత్రం ప్రస్తుతం ఉన్న కనీస అర్హతలో మార్పు లేదు. యాడ్ రెవెన్యూ కోసం కనీసం 1,000 మంది సబ్‌స్క్రైబర్లు ఉండాలి. దీంతో కొత్త నిబంధనల్లో వీటి మార్పు ఉండదు. అంతేకాకుండా ఇప్పటికే యూట్యూబ్ లో మానిటైజేషన్ ఉన్న క్రియేటర్లపై ఈ కొత్త ఎంట్రీ ప్రమాణాలు నేరుగా వర్తించవు.
ఎందుకు ఈ మార్పులు?
క్రియేటర్ ఎకానమీ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్లాట్‌ఫామ్‌లో యాక్టివ్‌గా, క్రమం తప్పకుండా మంచి కంటెంట్ అందించే క్రియేటర్లకు మరింత ప్రాధాన్యత ఇవ్వడమే ఈ మార్పుల ఉద్దేశ్యం. ఒక్క వీడియో వైరల్ కావడం లేదా తాత్కాలికంగా భారీ వ్యూస్ రావడం కంటే నిరంతర ప్రేక్షక ఆదరణ, నాణ్యమైన కంటెంట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని యూట్యూబ్ భావిస్తోంది.