Quad Summit 2026 : మనీలా: ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వానికి క్వాడ్ కూటమి విశ్వసనీయ పరిష్కారాలను అందిస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సముద్ర భద్రత, సరఫరా గొలుసులు, నూతన సాంకేతికతలు, విపత్తుల సమయంలో తక్షణ స్పందన వంటి కీలక రంగాల్లో క్వాడ్ నిర్మాణాత్మక భాగస్వామిగా పనిచేస్తోందని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మోదీ వెరీ టఫ్ మ్యాన్.. ఆయన గొప్ప నాయకుడు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో గౌరవం పొందుతున్నారు’’ అంటూ కొనియాడారు. దీంతో మనీలా వేదికగా జరిగిన క్వాడ్ అగ్రనేతల సమావేశం అంతర్జాతీయంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో మంగళవారం జరిగిన క్వాడ్ సమావేశంలో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని సనే తకైచి, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ.. క్వాడ్ కూటమి కేవలం నాలుగు దేశాల ప్రయోజనాలకే పరిమితం కాదని, మొత్తం ఇండో-పసిఫిక్ ప్రాంతానికి ఉపయోగపడేలా పనిచేస్తోందని వివరించారు. కూటమి తదుపరి దశలో మరింత స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
మనీలా నగరంతో క్వాడ్‌కు ఉన్న చారిత్రక అనుబంధాన్ని కూడా మోదీ గుర్తుచేశారు. 2007లో నాలుగు దేశాలు తొలిసారిగా మనీలాలో సమావేశమయ్యాయని, 2017లో తిరిగి ఇదే వేదికపై చర్చలను పునఃప్రారంభించాయని తెలిపారు. 2026లో మరోసారి ఇక్కడ సమావేశం కావడం కీలక మైలురాయిగా అభివర్ణించారు. ఇప్పటివరకు నాలుగు దేశాల విదేశాంగ మంత్రులు ఐదుసార్లు సమావేశమయ్యారని, ఇది పరస్పర నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.
మోదీపై ట్రంప్ ప్రశంసలు
క్వాడ్ నేతల ఫొటో సెషన్ సందర్భంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా నిలిచాయి. ప్రధాని మోదీని ఉద్దేశించి ఆయన ‘‘ఆయన చాలా టఫ్ మ్యాన్’’ అని వ్యాఖ్యానించారు. అనంతరం గొప్ప నాయకుడని, ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందుతున్నారని ప్రశంసించారు. జపాన్ ప్రధాని సనే తకైచి మరింత కఠినంగా ఉండవచ్చని సరదాగా వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌తో పాటు తనను కూడా ప్రస్తావిస్తూ చమత్కరించారు. ట్రంప్ వ్యాఖ్యలతో అక్కడ నవ్వులు విరిశాయి.
చైనాకు దౌత్య సంకేతాలా?
ఈ సమావేశంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని సముద్ర మార్గాల రక్షణ, వాణిజ్య భద్రత, కీలక ఖనిజాల సరఫరా, వ్యూహాత్మక సాంకేతికతలపై ప్రధానంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. క్వాడ్‌లో సభ్యత్వం లేని ఫిలిప్పీన్స్‌లో ఈ సమావేశం జరగడం కూడా వ్యూహాత్మకంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దక్షిణ చైనా సముద్రంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ భేటీకి మరింత ప్రాధాన్యం ఏర్పడింది.
మోదీ ఇండో-పసిఫిక్ ప్రాంతానికి క్వాడ్ ద్వారా విశ్వసనీయ భాగస్వామ్యాన్ని అందించడంపై దృష్టి సారిస్తే, ట్రంప్ బహిరంగ వేదికపై మోదీ నాయకత్వాన్ని ప్రశంసించడం ఈ సమావేశానికి మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది.