Pakistan Drone Infiltration : మన దాయాది దేశం ఫాకిస్తాన్ కొన్ని రోజులుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇటీవలే చైనా, తుర్కియే నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకుంది. దీంతో భారత్ కూడా అప్రమత్తమైంది. ఇటీవలే అపాచీ, రుద్ర హెలీక్యాప్టర్లతో పాకిస్తాన్‌కు హెచ్చరిక పంపింది. అయినా పాకిస్తాన్ అంతర్గత సమస్యల నుంచి దేశ ప్రజల దృష్టి మళ్లించేందుకు భారత్‌పై కుట్రలు చేస్తోంది. తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి మళ్లీ అనుమానాస్పద కదలికలు నమోదయ్యాయి. శత్రు భూభాగం నుంచి వచ్చిన మానవరహిత విమానం భారత ప్రాంతంలోకి ప్రవేశించే ప్రయత్నం చేయడంతో సరిహద్దు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.
మెంధార్ సెక్టార్‌లో డ్రోన్ కదలిక
శుక్రవారం(ఆగస్టు 28) రాత్రి సుమారు 8:05 గంటలకు పూంచ్ జిల్లా పరిధిలోని మెంధార్ ప్రాంతంలోని బెహ్రూటీ గ్రామం పైన ఒక అన్‌మ్యాన్డ్ డ్రోన్ కనిపించింది. 22 జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ పరిధిలో ఉన్న ఈ ప్రాంతంలో అది కొంతసేపు తిరిగి, మంగళ్‌నార్–దబ్రోత్ దిశగా ముందుకు సాగేందుకు ప్రయత్నించింది. సరిహద్దు కాపలా బలగాలు తక్షణం స్పందించడంతో అది వెనక్కి వెళ్లిపోయింది. డ్రోన్ తిరిగి వెళ్లినప్పటికీ భద్రతా దళాలు జాగ్రత్త తీసుకోవడం మానలేదు. ఆయుధాలు, మాదక ద్రవ్యాలు లేదా పేలుడు పదార్థాలు ఎక్కడైనా వదిలిపెట్టబడ్డాయేమోనని శనివారం ఉదయం నుంచే విస్తృతంగా గాలింపు చేపట్టింది. సైనికులు, బీఎస్‌ఎఫ్, స్థానిక పోలీసులు కలిసి అడవి ప్రాంతాలు, ముందు వరుస గ్రామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అదనపు నిఘా వ్యవస్థను బలోపేతం చేశారు.
చొరబాట్లు పునరావృతం..
ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఇలాంటి సంఘటనలు పెరుగుతున్నాయి. ఈ నెలలోనే కతువా సమీపంలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి, గత నెలలో రాజౌరీ జిల్లా సుందర్‌బని ప్రాంతంలోనూ అనుమానాస్పద వాహనాలు కనిపించాయి. జూన్‌లో బాలాకోట్ సెక్టార్‌లోనూ ఇలాంటి ప్రయత్నం జరిగింది. అప్పుడు భారత బలగాలు కాల్పులు జరపడంతో అది వెనుదిరిగింది. ఈ వరుస సంఘటనలు ఉగ్రవాదులకు ఆయుధాలు చేరవేయడమే ప్రధాన లక్ష్యంగా పాకిస్తాన్ చేస్తోందని భావిస్తున్నారు.
టర్కీతో సైనిక సంబంధాలపై అనుమానాలు..
ఇస్లామాబాద్‌తో టర్కీ కొనసాగిస్తున్న సైనిక సహకారం కూడా భద్రతా వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇటీవల టర్కీకి చెందిన రవాణా విమానాలు నూర్ ఖాన్, మస్రూర్, మురీద్ వంటి వాయు స్థావరాల్లో పెద్ద సంఖ్యలో దిగినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా చూపిస్తోంది. ఈ విమానాల ద్వారా అధునాతన డ్రోన్లు లేదా సైనిక పరికరాలు సరఫరా అయ్యాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్‌వోసీ వెంట నిఘాను మరింత కఠినంగా కొనసాగిస్తున్నారు.
సరిహద్దు ప్రాంతాల్లో ఇలాంటి ప్రయత్నాలు పెరగడం స్థానిక ప్రజల్లో అభద్రతా భావనను పెంచుతోంది. భారత రక్షణ వ్యవస్థ సాంకేతిక నిఘా, వేగవంతమైన స్పందన ద్వారా ఇప్పటి వరకు ఈ ప్రయత్నాలను అడ్డుకుంటోంది. అయినప్పటికీ పునరావృతం అవుతుండడంతో మరింత అమ్రత్తత అవసరాన్ని తెలియజేస్తుంది.