India Russia S 400 Deal: భారత్, రష్యా అనుబంధం ప్రత్యేకమైనది. పరస్పర సహకారంతో ఇరు దేశాలు అన్నిరంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇక ఇటీవల ఉక్రెయిన్‌తో యుద్ధం, అమెరికా, యురోపియన్ యూనియన్ ఆంక్షలతో కష్టకాలంలో ఉన్న రష్యా భారత్ ఆదుకుంటోంది. రష్యా కూడా భారత్‌కు తక్కువ ధరకు క్రూడ్ ఆయిల్ సరఫరా చేస్తోంది. ఇక భారత్, రష్యా మధ్య డిఫెన్స్ డీల్ చాలా బలమైనది. ఇప్పటికే అనేక ఆయుధాలను భారత్ రష్యా నుంచి కొనుగోలు చేస్తోంది. రష్యా అందించిన ఎస్ – 400 ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో సమర్థవంతంగా పనిచేసింది. పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టింది. ఈ క్రమంలో భారత వైమానిక భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా రష్యా ముఖ్యమైన ప్రతిపాదన చేసింది. భారత వైమానిక దళం కోసం అదనపు ఎస్–400 స్క్వాడ్రన్ల సరఫరాకు సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ డ్రాఫ్ట్‌ను అందించగా, దాదాపు రూ.50 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ ఒప్పందం దేశ రక్షణ సామర్థ్యానికి కొత్త ఊతం ఇవ్వనుంది.
ఆపరేషన్ సిందూర్‌లో సక్సెస్‌గా..
ఆపరేషన్ సిందూర్ సమయంలో ఈ వ్యవస్థ చూపిన ప్రదర్శన శత్రు పక్షాల్లో భయాన్ని రేకెత్తించింది. సరిహద్దుల నుంచి 200 కిలోమీటర్ల పరిధిలోకి ప్రవేశించేందుకు పాకిస్థాన్ యుద్ధ విమానాలు సంకోచించాయి. మనం సుమారు 314 కిలోమీటర్ల దూరంలోని నిఘా విమానాన్ని నేలకూల్చడం ద్వారా ఇది ప్రపంచంలోనే అత్యంత దూరపు సర్ఫేస్–టు–ఎయిర్ దాడిగా రికార్డు నెలకొల్పింది. చైనా సరఫరా చేసిన జె–10 విమానాలపైనా దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇలాంటి విజయాలు ఈ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచాయి.
కొత్తగా కొనుగోళ్లు..
2018లో కుదుర్చుకున్న ఒప్పందం కింద ఇప్పటికే నాలుగు ఎస్–400 స్క్వాడ్రన్లను రష్యా భారత్‌కు అందించింది. ఐదోది ఈ ఏడాది నవంబర్‌లో రావాల్సి ఉంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత మరో అయిదు స్క్వాడ్రన్ల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒప్పందం జరిగిన మూడేళ్ల నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఈ కొత్త యూనిట్లను చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించి ద్విముఖ భద్రతా వలయాన్ని బలపరచాలని ప్రణాళిక ఉంది. అదనంగా భారత సైన్యం 280 క్షిపణులను కూడా సమకూర్చుకుంటోంది.
విదేశీ సరఫరాపైనే ఆధారపడకుండా, ప్రాజెక్ట్ కుశ ద్వారా స్వదేశీ లాంగ్ రేంజ్ వ్యవస్థను వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇటీవల 140 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించడం ద్వారా ఇది తొలి విజయాన్ని నమోదు చేసింది. దేశవ్యాప్తంగా సమగ్ర గగనతల రక్షణ కల్పించేందుకు మిషన్ సుదర్శన్ చక్ర పేరుతో సమన్వయ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇది విదేశీ సాంకేతికతతోపాటు ఆత్మనిర్భర్ వైపు నడిపిస్తున్నాయి.