Russian SU-57: పరేషన్ సిందూర్ తర్వాత భారత్ సొంత ఆయుధాల తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆపరేషన్ సిందూర్‌తో మన శక్తి ప్రపంచానికి తెలిసింది. దీంతో మన ఆయుధాల కొనుగోలుకు ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఇదే సమయంలో అగ్రరాజ్యం అమెరికా, చైనా, పాకిస్తాన్ మన ఆయుధ సంపత్తి, రక్షణ వ్యవస్థ చూసి నివ్వెరపోయాయి. ఈ నేపథ్యంలో భారత్ ఆత్మనిర్బర్ భారత్‌లో భాగంగా సొంతంగా అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకుంటోంది. తాజాగా రష్యా అత్యాధునిక ఐదో తరం స్టెల్త్ యుద్ధవిమానం ఎస్‌యూ–57ను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు అనుమతిస్తూ, పూర్తి టెక్నాలజీ బదిలీకి అంగీకరించడం చారిత్రాత్మక పరిణామం. ఇది కేవలం ప్రాజెక్ట్ కాదు, ప్రపంచ రక్షణ పారిశ్రామిక వేదికపై భారత్ స్థానాన్ని మరో దశకు తీసుకెళ్లే దిశగా ఉన్న వ్యూహాత్మక మలుపు.
హెచ్‌ఏఎల్ తయారీ సామర్థ్యంపై నమ్మకం
సుఖోయ్ డిజైన్ బ్యూరో, రష్యా టెక్నికల్ బృందం ఇటీవల హెచ్‌ఏఎల్ సౌకర్యాలను సమీక్షించి, ఇప్పుడు సంస్థ వద్ద ఉన్న మౌలిక వనరులు ఎస్‌యూ–57 ఉత్పత్తికి సరిపోతాయని తేల్చింది. నాసిక్, కోరాపుట్, బెంగళూరులోని తయారీ యూనిట్లు ఇప్పటికే యంత్రాంగం, టెస్టింగ్ సామర్థ్యాలతో మూడో తరం జెట్స్ స్థాయిలో ఉన్నాయని నివేదిక వివరించింది.
బలమైన వ్యూహాత్మక బంధం..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్ పర్యటనకు వస్తున్నారు. ఈ క్రమంలో ఎస్‌యూ–57 సంయుక్త ఉత్పత్తి ఒప్పందం చర్చల కేంద్రంగా నిలుస్తోంది. ఇరుదేశాల మధ్య వృద్ధి చెందుతున్న సైనిక సహకారం, ఎస్–400 క్షిపణి వ్యవస్థ నుంచి బ్రహ్మోస్ మిసైల్ వరకు ఎస్‌యూ–57 ప్రాజెక్ట్‌తో మరింత బలపడనుంది. దీని ద్వారా భారత్ వైమానిక రంగంలో అమెరికా, చైనా, రష్యా తరహా శక్తుల స్థాయిలో అడుగుపెట్టే అవకాశముంది.
టెక్నాలజీ బదిలీ..
రష్యా ఈసారి కేవలం అసెంబ్లీ హక్కులు కాదు, పూర్తి సోర్స్ కోడ్, కాంపోజిట్ టెక్నాలజీ, రాడార్ ఓపాకింగ్ కోటింగ్‌లను పంచడానికి సిద్ధంగా ఉండడం విశేషం. దీని ద్వారా భారత్ రక్షణ ఉత్పత్తులపై విదేశీ ఆధారాన్ని తగ్గించుకోగలదు. అయితే దీనితో పాటు, అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీని నిర్వహించే భద్రతా బాధ్యత కూడా పెరుగుతుంది. ఇది వ్యూహాత్మకంగా గొప్ప అవకాశమే అయినప్పటికీ, మున్ముందు కఠిన సాంకేతిక నియంత్రణ చర్యలు అవసరమవుతాయి.
వైమానిక బలం రెట్టింపు..
భారత వైమానిక దళం ప్రస్తుతం తగిన ఫైటర్ స్క్వాడ్రన్‌ల లోటు ఉంది. ఎస్‌యూ–57ఈ ఉత్పత్తి ప్రారంభమైతే, ఆ లోటు పూడ్చడమే కాదు, ప్రపంచపు అత్యాధునిక ఎయిర్ సూపరియారిటీ సాధనకు మార్గం సుగమం చేస్తుంది. ఏఎంసీఏ ప్రాజెక్ట్‌కి ఈ సహకారం ఆధునిక టెక్నాలజీ పరిశోధనలో పెరుగుదల కలిగించి, స్థానిక రూపకల్పన సామర్థ్యాన్ని కూడా పెంపొందిస్తుంది.
భారత్–రష్యా ఒప్పందం అమల్లోకి వస్తే, భారత రక్షణ రంగం కొత్త మైలురాయిని దాటుతుంది. విదేశీ ఆధారాన్ని తగ్గించి, హైఎండ్ సిస్టమ్‌లను దేశీయంగా తయారు చేయడం ద్వారా ‘మేక్ ఇన్ ఇండియా’ బ్రాండ్‌గా నిలుస్తుంది. ఇది దేశానికి వ్యూహాత్మక స్వేచ్ఛను ఇవ్వడమే కాకుండా, ప్రపంచ రక్షణ మార్కెట్‌లో కీలక భాగస్వామిగా భారత్ నిలిచే అవకాశం ఉంది.