
ABN RK- Pawan Kalyan: ఏపీలో ఎల్లో మీడియా తీరే వేరు. తన ప్రసారాలకు, కథనాలకు, వార్తలకు పరామార్ధం ఒక్కటే. అదే తెలుగుదేశం విశాల ప్రయోజనాలు. వాటి కోసం ఈ మీడియా ఎంతకైనా తెగిస్తుంది. మరీ ముఖ్యంగా ఏబీఎన్ ఆర్కే రాతలు రోత పుట్టిస్తాయి. ఎదుటి వారిని మానసికంగా హింసిస్తాయి. తెలుగునాట చిరంజీవి కుటుంబంపై బురద జల్లడంలో ఆర్కే ముందుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ చుట్టూ విష వలయం చుడుతున్నారు. టీడీపీతో కలిసి నడిస్తే ఒకలా.. నడవకుంటే మరోలా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ ను దారిలోకి తెచ్చేందుకు అడ్డగోలు రాతలు రాస్తున్నారు. అవే నిజమని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
ఆ కథనంతో పెను దుమారం...
కొద్దిరోజుల కిందట ఆర్కే తన కొత్త పలుకులో పవన్ కు కేసీఆర్ రూ.1000 కోట్లు ఆఫర్ చేసినట్టు రాసుకొచ్చారు. టీడీపీతో కాకుండా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే పెద్ద మొత్తంలో ఆర్థిక ప్యాకేజీ అందిస్తారన్నది ఈ కథనం సారాంశం. దీనిపై ఇంటా బయటా ఆర్కే విమర్శలు ఎదుర్కొన్నారు. అటు బీఆర్ఎస్, ఇటు జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో రియాక్టయ్యాయి. మెగా బ్రదర్ నాగబాబు సైతం ఘాటుగా రియాక్టయ్యారు. దానిపై సంజాయిషి ఇచ్చుకునే క్రమంలో తాను కేసీఆర్ ఆఫర్ చేసిన విషయాన్ని మాత్రమే రాశానని.. పవన్ అమ్ముడుపోయినట్టు రాయలేదని వక్రభాష్యం చెబుతూ ఈ సంజాయిషి సాగింది. దీంతో అక్కడితే వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.
రాజ్దీప్ సర్దేశాయ్ కాలమ్ తో…
ఇప్పుడు రాజ్దీప్ సర్దేశాయ్ కాలమ్ ను అడ్డం పెట్టుకొని ఆర్కే మళ్లీ రోత రాతలు, పవన్ పై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే ఎన్నికలకు అయ్యే ఖర్చు పెట్టుకుంటానని కేసీఆర్ ఆఫర్ చేసినట్టు రాజ్జీప్ సర్దేశాయ్ తన కాలమ్ లో రాసుకొచ్చారు. కేవలం ఎన్నికల వేళ, పార్టీల మధ్య పొత్తులు, ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో భాగంగానే ఆయన యథాలాపంగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు దానినే ముడిపెడుతూ తాను అన్నదే .. రాజ్దీప్ సర్దేశాయ్ చెప్పారంటూ ఆర్కే కొత్త పల్లవి అందుకున్నారు. కేసీఆర్ రూ.1000 కోట్లు ఇస్తారని.. పవన్ ఒప్పుకున్నారంటూ ఆయన నేరుగా ఎక్కడా చెప్పలేదు. కానీ నాడు రాసిన రోతలను సర్దేశాయ్ రాతలతో ముడిపడుతూ మరోసారి పవన్ పై ఆర్కే కర్కశాన్ని ప్రకటిస్తున్నారు.

పవన్ వ్యక్తిత్వాన్ని దిగజార్చడం వెనుక…
తెలంగాణ సీఎం కేసీఆర్ డబ్బులతో రాజకీయం చేస్తున్నారని ఆర్కే చాన్నాళ్లుగా చెప్పుకొస్తున్నారు. అందులో వాస్తవం ఉండొచ్చు.. కానీ పవన్ వ్యక్తిత్వాన్ని మరింత దిగజారేలా ఆయన అమ్ముడుపోతున్నారని రాయడం మాత్రం విస్తుగొల్పుతోంది. తాను ఎందుకు అమ్ముడుపోతానని పవన్ బయటకు వచ్చి నిలదీశారు. రోజుకు రూ.2 కోట్లు సంపాదించే తను ఎందుకు అమ్ముడిపోతానని కూడా ధీటుగా జవాబిచ్చారు. హుందాతనం పాటిస్తూ ఎక్కడా పేర్లు ప్రస్తావించకుండానే క్లారిటీ ఇచ్చారు. అయినా పవన్ పై ఆర్కే కక్ష తీరలేదు. రాజ్దీప్ సర్దేశాయ్ తాజా కథనంతో మళ్లీ ఆర్కే పాత పాట మొదలు పెట్టారు. కేవలం టీడీపీతో స్నేహం పోతుందనో.. లేకుంటే సీఎం పదవి కోరతారనో పవన్ పై ఆర్కే విషం చిమ్ముతున్నారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి రోత రాతలకు ఆర్కే మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా హెచ్చరిస్తున్నారు.