
Dadi Veerabhadra Rao: దాడి వీరభద్రరరావు.. తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు. తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు. ఈ హిందీ మాస్టారు టీడీపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. ఆ పదవి కొనసాగింపు లభించలేదని టీడీపీని వీడి వైసీపీలో చేరారు. దశాబ్ద కాలంగా ఆ పార్టీలో కొనసాగుతున్నా ఆయనకు సరైన గుర్తింపు లభించడం లేదు. గత ఎన్నికల్లో పార్టీ హైకమాండ్ సొంత నియోజకవర్గం అనకాపల్లికి కాదని.. విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని కుమారుడు రత్నాకర్ కు కేటాయించింది కానీ ఓటమి తప్పలేదు. ఇప్పుడు మరోసారి పోటీకి సిద్ధపడుతున్నా హైకమాండ్ పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో దాడి కుటుంబం కలత చెందుతోంది. పార్టీ మారడానికి దాదాపు సిద్ధమైంది.
గత ఎన్నికలకు ముందు..
గత ఎన్నికల ముందు దాడి వీరభద్రరావు టీడీపీలో చేరతారని ప్రచారం సాగింది. మాజీ మంత్రి కళా వెంకటరావుతో చర్చలు జరపడంతో దాడి టీడీపీలో చేరడం ఖాయని టాక్ వినిపించింది. అయితే వైసీపీ హైకమాండ్ కలుగజేసుకొని ఆయన కుమారుడికి విశాఖ నగరంలో ఎక్కడో ఒక చోట చాన్స్ ఇస్తామని చెప్పడంతో వెనక్కి తగ్గారు. వైసీపీలో కొనసాగారు. 2018లో పవన్ కళ్యాణ్ దాడి వీరభద్రరావు ఇంటికి మర్యాదపూర్వకంగా వెళ్లి కలిశారు. దీంతో ఆయన జనసేనలో చేరతాని మరోసారి ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ జరగలేదు. ఇప్పటివరకూ దాడి వైసీపీలో కొనసాగుతూ వస్తున్నారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు వచ్చినట్టే వచ్చి చేజారిపోతుండడంతో వీరభద్రరావు అంతర్మథనం చెందుతున్నారు. అటు కుమారుడికి సైతం టిక్కెట్ వచ్చే చాన్స్ లేకపోవడంతో ఆయన ఇప్పుడు పవన్ పంచన చేరడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
టీడీపీలో మంచి వాయిస్ ఉన్న నేతగా..
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ గా, పార్టీ వాయిస్ ను వినిపించడంలో దాడి వీరభద్రరావు ముందంజలో ఉండేవారు. అందుకే ఎన్టీఆర్, చంద్రబాబు ఆయనకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. కానీ దాడి రాజకీయంగా తప్పటడుగులు వేశారు. దీంతో పవర్ పాలిటిక్స్ కు దూరమయ్యారు. అటు కుమారుడు రత్నాకర్ కు మంచి రాజకీయ భవిష్యత్ ఇవ్వలేకపోయారు. టీడీపీలోకి తిరిగి వెళదామంటే చంద్రబాబుతో పూడ్చుకోలేని అగాధం ఏర్పడింది. అందుకే జనసేనలో చేరాలని దాదాపు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అక్కడకు వెళితేనే గౌరవం దక్కుతుందన్న భావనతో ఆయన ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయన జనసేన నేతలతో చర్చలు జరిపినట్టు టాక్ వినిపిస్తోంది.

త్వరలో పవన్ గూటికి?
పవన్ వారాహి యాత్రకు సిద్ధపడుతున్నారు. కొద్దిరోజుల్లో దీనికి సంబంధించి షెడ్యూల్ విడుదల కానుంది. యాత్ర సమయంలో భారీగా చేరికలు ఉంటాయని ప్రచారం సాగుతోంది. అయితే ఆ సమయంలో దాడి కుటుంబం చేరుతుందా? లేక ముందుగానే చేరి పార్టీ లో యాక్టివ్ రోల్ ప్లే చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. దాడి వీరభద్రరావు వాయిస్ ఉన్న నేత కావడంతో ఆయన సేవలను సద్వినియోగం చేసుకోవాలని పవన్ డిసైడయినట్టు సమాచారం. అయితే ఇప్పటికే దాడి వీరభద్రరావుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన గ్రాఫ్ పెరిగింది. దాడి రాకతో దీనిని మరింత పటిష్టం చేసుకోవాలని పవన్ చూస్తున్నారు. సో మరికొద్దిరోజుల్లో దాడి కుటుంబం జనసేనలోకి రావడం పక్కాగా తేలింది. దీంతో జన సైనికులు ఖుషీ అవుతున్నారు.