Jagan: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఒక వేడుకలా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తద్వారా ఒక సానుకూలమైన వాతావరణం ప్రజల్లో ఏర్పరచాలని.. ప్రభుత్వం పట్ల సంతృప్తి పెంచాలన్న ఆలోచనలో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఈ విషయంలో క్రెడిట్ కొట్టేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతుండడం విమర్శలకు తావిస్తోంది. ధర్మాన ప్రసాదరావు నుంచి సాక్షి మీడియా ప్రతినిధుల వరకు దీనిపైనే ప్రచారం మొదలుపెట్టారు. 2023 మేలో శంకుస్థాపన చేశారని.. జగన్మోహన్ రెడ్డి ఏడాది కాలంలోనే ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేశారని చెప్పడం ప్రారంభించారు. అయితే జగన్మోహన్ రెడ్డి విమానాశ్రయం విషయంలో చేసిన ప్రకటనలను హైలెట్ చేస్తూ పాత వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెడుతున్నాయి.
* ఉత్తరాంధ్రలో ప్రభావం..
అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొంచెం ఇబ్బంది పడుతోంది. ఉత్తరాంధ్ర పై ప్రభావం ఉంటుందని ఆ పార్టీ నేతలు కూడా భయపడుతున్నారు. సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు మాటలు కూడా అలానే ఉన్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని ప్రారంభించి పనులు మొదలు పెట్టారని ధర్మాన గుర్తు చేస్తున్నారు. సాక్షి మీడియా సైతం దానిని హైలెట్ చేస్తోంది. విమానాశ్రయ నిర్మాణాన్ని ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి అని కథనాలు ప్రచురిస్తోంది. మరోవైపు విమానాశ్రయంపై ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ప్రజల నుంచి సానుకూలత వ్యక్తం అవుతోంది.
* వ్యతిరేక వ్యాఖ్యల వీడియోలు..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి మారడంతో సోషల్ మీడియాలో పాత వీడియోలు బయటకు వస్తున్నాయి. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ బస్సు వస్తుందట.. విశాఖ విమానాశ్రయం ఉండగా ఇక్కడ ఎందుకు దండగ.. ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వకండి, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అడ్డుకుందాం.. ఇలా జగన్ రకరకాలుగా మాట్లాడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుండడం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది. ఆ పార్టీకి ఒక స్టాండ్ లేదంటూ ఎక్కువ మంది వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవైపు నేతల మాటలు.. ఇంకోవైపు అనుకూల మీడియాలో కథనాలు చూస్తుంటే మాత్రం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో వైసీపీలో ఒక రకమైన కలవరం కనిపిస్తోంది.