Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా అటవీ ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలో సరిగా పరిశీలన చేయాలి గాని.. కొత్త కొత్త మొక్కలు.. కొత్త కొత్త జీవజాతులను కనుగొనవచ్చు. ఏపీ రాష్ట్రానికి అటవీ శాఖ మంత్రి అయిన తర్వాత.. పవన్ కళ్యాణ్ ఆ శాఖలో పని చేసే ఉద్యోగులకు.. సిబ్బందికి విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చారు. అడవులను కాపాడే బాధ్యత వారి భుజాల మీద పెట్టారు. అంతేకాదు వారికి కావలసిన నిధులను.. ఇతర వ్యవహారాలను కూడా పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్రానికి అటవీ శాఖ మంత్రి అయిన తర్వాత అడవుల సంరక్షణకు నడుం బిగించారు. ముఖ్యంగా ఎర్రచందనం అక్రమ రవాణా కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఏకంగా టాస్క్ ఫోర్స్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విప్లవాత్మక మార్పులను పవన్ కళ్యాణ్ తీసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు పర్యావరణ పరిరక్షణ అంటే చాలా ఇష్టం. మొక్కలు పెంచడం.. కొత్త కొత్త జాతులను సేకరించడం మరింత ఇష్టం.
తాజాగా తిరుపతి జిల్లాలోని తూర్పు కనుమల ప్రాంతంలో శాస్త్రవేత్తలు ఒక అరుదైన మొక్కను గుర్తించారు. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పవన్ కళ్యాణ్ ఆ అరుదైన మొక్కకు పేరు పెట్టారు. ఈ మొక్క యుఫర్బియేసి కుటుంబానికి చెందింది. ఈ మొక్క ఉబ్బల మడుగు జలపాతానికి దగ్గరలో కంబకం కొండల ప్రాంతం వద్ద అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతం పేరు స్పురించే విధంగా ఆ మొక్కకు క్రోటన్ ఉబ్బల మడు గెన్సిస్ గా పేరు పెట్టారు. ఈ మొక్క ఆకులు పొడువుగా ఉంటాయి. లేత ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి. అంతేకాదు సుగంధభరితమైన వాసనను వెదజల్లుతూ ఉంటాయి. అయితే ఈ మొక్కలు ప్రస్తుతం అంతరించిపోయే దశలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
గతంలో ఈ మొక్కలు ఆకులను సుగంధ ద్రవ్యాలు తయారు చేయడంలో ఉపయోగించేవారు. వీటి కాండాలను సుగంధ తైలాల తయారీలో వాడేవారు. గతంలో ఈ మొక్కలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. ఆ తర్వాత మొక్కల సంఖ్య తగ్గిపోవడం ప్రారంభమైంది. వాతావరణంలో మార్పులు.. ఇతర కారణాలతో ఈ మొక్కల జాతి అంతరించిపోయే ప్రమాదంలో పడింది. ఇన్నాళ్లకు ఏపీ అటవీ శాఖ అధికారులు ఈ మొక్కలను గుర్తించారు. అయితే వీటి జాతిని కాపాడేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు ప్రకటించారు.