Khammam : శీర్షిక చదివారు కదా.. మీకు కొంతలో కొంత అర్థమై ఉంటుంది. సీసాలు మోసే హమాలి పోస్ట్ కు అన్ని డబ్బులు అవసరమా.. అన్ని కోట్లు చెల్లిస్తే.. నిజంగా వెనక్కి తిరిగి వస్తాయా.. రోజుకి ఏమైనా వేలల్లో కూలి గిడుతుందా.. ఇవే ప్రశ్నలు మీలో కలుగుతున్నాయి కదా.. మీకు మాత్రమే కాదు మాక్కూడా అలానే ఉన్నాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరాలో తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇండియన్ మేడ్ లిక్కర్ (ఐ ఎం ఎల్) పేరుతో ఒక డిపో ఉంది . ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి సరుకు మొత్తాన్ని దించుతారు. ఇక్కడినుంచి వైన్ షాపులకు సరఫరా చేస్తారు. ఇది ఎప్పటినుంచో కొనసాగుతూనే ఉంది. ఈ డిపోలో ఇటీవల హమాలీల నియామకానికి అధికారులు కసరత్తు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అసలు కథ తెర వెనుక గట్టిగానే నడిచింది. సాధారణంగా ఒక హమాలీ పోస్ట్ కు దాదాపు 20 నుంచి 25 లక్షలు దాకా అధికారులు వసూలు చేశారు. మొత్తంగా ఆరు పోస్టులకు కోట్లల్లోనే వసూలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. సరిగ్గా నెలరోజుల క్రితం ఆరుగురు హమాలీలను నియమించారు. వారి దగ్గర నుంచి దాదాపు కోటికి పైగా తీసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ డిపోలో హమాలీలను నియమించాలి అంటే జిల్లా అదనపు కలెక్టర్.. జిల్లా ఎక్సైజ్ సూపరిండెండెంట్.. కార్మిక శాఖ అధికారులతో ఒక కమిటీ ఏర్పాడాలి. ఆ కమిటీ సూచనల మేరకు హమాలీలను నియమించాలి. హమాలీల విషయంలో స్థానికులకు మాత్రమే ప్రాధాన్య ఇవ్వాలి. కమిటీ ఏర్పడకుండానే.. నిబంధనలు పట్టించుకోకుండానే.. కొంతమంది హమాలి నాయకులు.. అధికారులతో కలిసి కుమ్మక్కయ్యారు. లక్షలు వసూలు చేశారు. ఈ డిపోలో మొత్తం 43 మంది హమాలీలు మాత్రమే ఉండాలి. గడచిన పదేళ్ల కాలంలో ఈ సంఖ్య 43 నుంచి 59 కి పెరగడం విశేషం. ఎటువంటి నిబంధనలు లేకుండానే 16 మందిని అక్రమ మార్గంలో నియమించుకున్నారు. ఒక్కొక్క హమాలి నుంచి లక్షలు వసూలు చేసి మొత్తంగా కోట్లు వెనకేసుకున్నారు.
కొద్ది సంవత్సరాల క్రితం స్థానికేతరులను హమాలీలుగా తీసుకొని.. డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. అప్పుడు పెద్ద ఎత్తున ఆందోళనలు.. దీక్షలు కూడా జరిగాయి. నాడు నిబంధనల ప్రకారమే హమాలీలను తీసుకోవాలని ఒక షరతు విధించారు. అయితే ఆ తర్వాత కొంతమంది హామాలీలు.. అధికారులతో కలిసి జట్టుగా ఏర్పడ్డారు. అప్పటి నుంచి వారు చెప్పిందే విధంగా సాగుతోంది.
కొంతకాలం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తల్లాడ లో ఒక ప్రైవేట్ గోదాములను అద్దెకు తీసుకున్నారు. అక్కడ బీరు సరఫరా చేసే డిపో ఏర్పాటు చేశారు. 50 మంది హమాలీలకు అక్కడ ఉపాధి లభిస్తుంది. ఇక్కడ కమిటీ నిబంధనల ప్రకారమే హమాలీలను ఏర్పాటు చేశారు. వైరాలో మాత్రం కమిటీని ఏర్పాటు చేయకుండానే ఆరుగురు హమాలీలను నియమించారు. డిపో అధికారులకు కూడా వాటా ఉండడంతో ఈ వ్యవహారంపై వారు నిశ్శబ్దంగా ఉన్నారు. అయితే అధికారులను ఈ వ్యవహారం మీద ప్రశ్నిస్తే వారు.. వింత సమాధానం చెబుతున్నారు. తాము కేవలం 59 మందిని మాత్రమే హామీలుగా గుర్తిస్తున్నామని ప్రకటించారు. ఆ సంఖ్యకు మించి ఎక్కువ ఉంటే వారిని గుర్తించదుమని స్పష్టం చేస్తున్నారు. కాగా ఈ డిపోలో పనిచేస్తున్న హమాలీలకు ప్రతిరోజు 2000 నుంచి 3000 వరకు లభిస్తుంది. కొన్ని సందర్భాలలో ఆ సంఖ్య నాలుగు నుంచి ఐదువేలకు కూడా చేరవచ్చు. అందువల్లే ఇక్కడి హమాలి పోస్టులకు ఈ స్థాయిలో డిమాండ్ ఉంటుంది.