Wyra Road Accident: అది ఖమ్మం జిల్లా వైరా పట్టణం.. వైరా పట్టణానికి సమీపంలో అక్కడి వాగుపై ఒక వంతెన ఉంటుంది. ఈ వంతలను గతంలో ఎప్పుడో నిర్మించారు. వైరా పట్టణం క్రమక్రమంగా విస్తరించడంతో.. పట్టణంలో పోగుపడుతున్న చెత్తను ఈ వంతెన కింద డంప్ చేస్తున్నారు. పోగు పడిన చెత్తను వారం నుంచి పది రోజుల వ్యవధిలో ఒకసారి తగలబెడుతున్నారు. చెత్త తగలబడుతున్నప్పుడు వెలువడుతున్న పొగ ఆ వంతెన మీదుగా ప్రయాణించే ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. ఇక శివారు ప్రాంతాలలో ఉన్న వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చెత్తను డంప్ చేయడానికి స్థలం లేకపోవడంతో వైరా మున్సిపాలిటీ సిబ్బంది ఇక్కడే దానిని పడేస్తున్నారు. ఇక వర్షాకాలంలో అయితే వరద నీరు ప్రవహించి ఆ చెత్త మొత్తం అందులోనే కలుస్తోంది. ఈ నీరు వైరా నదిలో కలవడం వల్ల కలుషితమైపోతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని ఎన్నోమార్లు ప్రజలు అధికారులను, ప్రజా ప్రతినిధులను కోరినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.
వైరా పట్టణంలో ఉన్న ఈ వంతెన మీదుగా శుక్రవారం రెండు పెద్ద వాహనాలు ఎదురెదురుగా ప్రయాణించాయి. ఈ క్రమంలో ఇనుప చువ్వల లోడ్ తో వేగంగా వస్తున్న లారీ.. కొబ్బరి బోండాలతో వస్తున్న వ్యాన్ ను ముందుగా ఢీకొట్టింది. ఆ తర్వాత అదే వేగంతో ఎదురుగా వస్తున్న ఒక కారును కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వంతెన పైనుంచి 45 అడుగుల కిందికి ఆ కారు ఎగిరి పడింది. పూర్తిగా సినిమా తరహాలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ కారు మీద లారీలో ఉన్న ఇనుప చువ్వలు పడిపోయాయి. ఆ ఇనుప చువ్వల బరువుకు కారు మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది. ఆ కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా.. ఒకరికి గాయాలయ్యాయి. మిగతా నలుగురు మాత్రం ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. వాస్తవానికి అక్కడ ప్రమాదం జరిగిన తీరు చూస్తే మాత్రం ఎవరికైనా ఒళ్ళు జలదరిస్తుంది. అయితే అంతటి ప్రమాదం జరిగినప్పటికీ కింద చెత్త ఉండడం వల్ల వారికి ఎటువంటి గాయాలు కాలేదు. పైగా కారు ధ్వంసం అయినప్పటికీ ఒకరు మినహా మిగతావారు సురక్షితంగా బయటపడ్డారు. మున్సిపాలిటీ సిబ్బంది చెత్త ఇక్కడ వేయడం వల్లే వారు ప్రాణాలతో బయటపడ్డారని స్థానికులు చెబుతున్నారు..
” చూస్తుండగానే ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఇంతటి దారుణం జరిగింది. కాకపోతే వంతెన పైనుంచి కారు పడటం వల్ల భారీగా ప్రాణ నష్టం చోటు చేసుకుంటుందని అనుకున్నాం. కానీ కారు మాత్రమే ధ్వంసం అయింది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురులో ఒకరికి మాత్రమే గాయాలయ్యాయి. మిగతావారు ప్రాణాలతో బయటపడ్డారు. నిజంగా వారు అదృష్టం చేసుకొని ఉంటారని” స్థానికులు చెబుతున్నారు.