Homeక్రైమ్‌Journalist fraud : విలేకరి చెప్పాడు.. పోలీసులు దోచుకున్నారు.. క్యా క్రైం హై

Journalist fraud : విలేకరి చెప్పాడు.. పోలీసులు దోచుకున్నారు.. క్యా క్రైం హై

Journalist fraud : అప్పట్లో రజినీకాంత్ సినిమా ఒకటి విడుదలైంది.. అందులో “దేవుడు చెప్పాడు.. అరుణాచలం పాటిస్తాడు” అనే డైలాగ్ సూపర్ ఫేమస్.. గుర్తుందా.. అలాంటి డైలాగు ను ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న ఓ విలేకరి వల్లె వేశాడు. దానిని పోలీసులు పాటించారు. చివరికి పోలీసులు దొరికిపోయారు. ఆ విలేకరి మరో ఆర్థిక నేరాల కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. కానీ ఈ మొత్తం ఎపిసోడ్ లో బకరాలయింది పోలీసులు. ఇందులో ఓ ఏసీపీ స్థాయి వ్యక్తి ఉండడం విశేషం. ఈ ఉదంతం పోలీసు వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. ఇంతకీ ఆ విలేకరి ఏం చెప్పాడు? పోలీసులు ఏం చేశారు? ఎలా దొరికిపోయారంటే?

ఖమ్మం జిల్లాలో జితేందర్ గోయల్ అనే వ్యక్తి ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్లో ఖరీదు దారుడిగా వ్యాపారం చేస్తున్నాడు. జితేందర్ ది రాజస్థాన్ రాష్ట్రం. జితేందర్ వద్ద వెంకన్న అనే వ్యక్తి గుమస్తాగా పనిచేస్తున్నాడు. జితేందర్ ఖమ్మంలో మిర్చి కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటాడు. అందులో విజయవాడ కూడా ఒకటి. విజయవాడలో ఉన్న ఒక వ్యాపారికి జితేందర్ ఇటీవల మిర్చి అమ్మాడు. దాని విలువ 10 లక్షల దాకా ఉంటుంది. ఆ పది లక్షల ను తీసుకురావాలని వెంకన్నను జితేందర్ ఆదేశించాడు. జితేందర్ ఇటీవల వ్యక్తిగత పని ఉండడంతో సొంత రాష్ట్రమైన రాజస్థాన్ వెళ్లిపోయాడు. జితేందర్ ఫోన్ లో చెప్పినట్టుగా వెంకన్న విజయవాడ వెళ్లి డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బులతో తిరుగు ప్రయాణమయ్యాడు. ఆ నగదును కోటి అనే వ్యక్తికి ఇవ్వాలని జితేందర్ వెంకన్నను ఆదేశించాడు. జితేందర్ చెప్పినట్టుగానే వెంకన్న డబ్బు ఇవ్వడానికి విజయవాడ నుంచి ఖమ్మం బయలుదేరాడు. ఈ క్రమంలోనే జితేందర్ పంపించిన కోటి నెంబర్ కు వెంకన్న ఫోన్ చేశాడు. తాను ఖమ్మం త్రీ టౌన్ ప్రాంతంలో ఉన్నానని కోటి చెప్పడంతో.. అక్కడికి వెళ్లాడు వెంకన్న.

కోటి రావడానికంటే ముందే టాస్క్ ఫోర్స్ పోలీసులు వాహనంలో అక్కడికి చేరుకున్నారు. అందులో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు నాగరాజు, ఉపేందర్ వెంకన్న వద్ద ఉన్న సంచిని పరిశీలించారు. అందులో నగదు ఉందని.. అది మిర్చి వ్యాపారికి ఇవ్వాలని వెంకన్న చెప్పినా వారిద్దరు వినిపించుకోలేదు. పైగా ఆ సంచిలో గంజాయి ఉందని వారు పేర్కొన్నారు. దీంతో వెంకన్న ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఈ విషయాన్ని వెంకన్న జితేందర్ కు చెప్పాడు. అతడు ఆ కానిస్టేబుళ్లకు విషయం చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు. పైగా వెంకన్న వద్ద ఉన్న నగదులో ఆరు లక్షలు తీసుకొని వెళ్ళిపోయారు. ఇదే విషయాన్ని వెంకన్న జితేందర్ కు చెప్పాడు. దీంతో అతడు ఈ నెల మూడున ఖమ్మం వచ్చాడు. నాలుగో తేదీన ఈ విషయాన్ని చాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలకు చెప్పాడు.

ఛాంబర్ ప్రతినిధులు జితేందర్ ను తీసుకొని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అక్కడ పోలీసులకు ఈ విషయం చెప్పారు. దీంతో పోలీసులు ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు వెల్లడించారు. దీనికంటే ముందుగానే ఈ విషయం లీక్ అయింది. అది ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్.. దీంతో ఆయన విచారణకు ఆదేశించారు. వెంకన్న వద్ద డబ్బులు తీసుకున్న కానిస్టేబళ్లు ఉపేందర్, నాగరాజును సస్పెండ్ చేశారు.. ఈ ఘటనలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సీటీసీ ఏసీపీ రవిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు..

ఈ వ్యవహారంలో కానిస్టేబుళ్లు, ఏసీపీ పాత్రలు మాత్రమే కనిపిస్తున్నప్పటికీ.. కనిపించని మరో పాత్రే ఆ విలేకరి.. ప్రముఖ పత్రికలో పనిచేస్తున్న ఆ విలేకరి గతంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ బీట్ చూసేవాడు. ఆరోపణలు రావడంతో మేనేజ్మెంట్ ఆ బీట్ నుంచి తప్పించింది. అయినప్పటికీ అతడు తన పాత పరిచయాలను కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఆ రిపోర్టర్ కు ఓ కమీషన్ వ్యాపారి సన్నిహితుడిగా ఉన్నాడు. అంతేకాదు మార్కెట్లో వ్యాపారులు సాగించే ఆర్థిక వ్యవహారాలు మొత్తం తెలుసు.. ఈ విషయాలు ఆ విలేకరికి కూడా బాగా తెలుసు..

జితేందర్ గుమస్తా వెంకన్న భారీగా డబ్బు తీసుకొస్తున్న విషయాన్ని పోలీసులకు సమాచారం అందించింది ఆ ప్రముఖ పత్రికలో పనిచేస్తున్న విలేకరి. అంతేకాదు పోలీస్ కానిస్టేబుళ్లు వెంకన్న దగ్గర్నుంచి డబ్బు తీసుకుంటున్నప్పుడు ఆ విలేకరి దూరం నుంచి చూస్తూనే ఉన్నాడు.. అంతేకాదు చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు స్పందించిన తీరు.. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిన వ్యవహారం మొత్తం కూడా ఏసీబీ రవికి అతడు వెల్లడించాడు.. అయితే ఈ విషయం బయట పడుతుందని భావించిన ఏసీపీ.. దోపిడీ చేసిన ఆరు లక్షల్లో ఐదు లక్షల వెంటనే ఆ వ్యాపారికి అప్పగించాడు. ఇక మిగతా లక్ష రూపాయలను మాత్రం ఆ విలేకరి తీసుకున్నాడు. ఆ డబ్బులు కూడా కానిస్టేబుళ్లు వెంకన్న దగ్గర తీసుకున్న కొద్ది నిమిషాల వ్యవధిలోనే తన వాటాగా ఆ విలేకరి జేబులో వేసుకున్నట్టు సమాచారం. ఈ వ్యవహారం మొత్తం విలేకరి కను సన్నలలోనే జరిగింది.

ఎప్పుడైతే కమిషనర్ ఆఫ్ పోలీస్ విచారణ మొదలుపెట్టారో.. అప్పుడే ఈ దోపిడీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ రిపోర్టర్, ఏసీపీ మధ్య ఉన్న సంబంధం బయటపడింది. ఇప్పటికే ఆ ఏసీపీ ని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ వ్యవహారంలో పోలీసులతో పంచాయితీ ఎందుకని జితేందర్ భావించడం, చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు సముదాయించడంతో కేసు నమోదు కాలేదు. సదరు విలేకరి ఆ సమయంలో బయటపడినప్పటికీ.. క్రిప్టో కరెన్సీ మోసం కేసులో కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసుల చేతిలో అరెస్టు అయ్యాడు. కేవలం తెలంగాణలోనే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో కూడా అతనిపై కేసులు నమోదు కావడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular