Vanajeevi Ramaiah : ఇవి మాత్రమే కాదు.. ఇంటి అవసరాలకు ఫర్నిచర్ గా.. చివరికి మనం కన్నుమూస్తే దహనం చేసే కర్రగా… వంట వండుకునేందుకు వంట చెరుకుగా.. ఇలా ఎన్నో రూపాలుగా మొక్కలు మనకు ఉపకరిస్తాయి. అందుకే మొక్కలతోనే మనిషి బతుకు. దీనిని గుర్తించే వన జీవిరామయ్య తనయుక్త వయసు నుంచే మొక్కలు నాటడం మొదలుపెట్టారు. ముందుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో రోడ్డుకు ఇటు అటు మొక్కలు నాటారు . అప్పట్లో ఆయన మొక్కలు నాటుతుంటే పిచ్చివాడిలాగా చూసేవారు. ఒక చిన్న సైకిల్ మీద సంచిలో మొక్కలు వేసుకొని.. నాటుకుంటూ వెళ్లిపోయేవారు. ఇది వారి సొంత కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బంది కలిగించేది. కొన్ని సందర్భాల్లో ఆయనను వారించారు కూడా. అయినప్పటికీ వనజీవి రామయ్య తన తీరు మార్చుకోలేదు. హరిత సంకల్పాన్ని వదిలిపెట్టలేదు. ఎండాకాలంలో గుట్టల్లో విత్తనాలు నాటేవారు. ఇప్పుడంటే విత్తన బంతులు చేస్తున్నాం.. మొత్తం చల్లేస్తున్నామని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు గాని.. ఇవేవీ తెలియని రోజుల్లోనే విత్తన బంతులను తయారుచేసి.. నాటిన ఘనత వన జీవి రామయ్యది. చివరికి రెడ్డిపల్లెలోని తన స్వగృహాన్ని కూడా ఆయన ఒక చిట్టడి లాగా మార్చారు. అందులో ఎర్రచందనం మొక్కలు.. పండ్ల మొక్కలు.. పూల మొక్కలు విస్తారంగా ఉంటాయి..
Also Read : కోటి మొక్కలు నాటిన వనజీవి రామయ్య ఇకలేరు..
కోటికి పైగానే మొక్కలు నాటారు
వనజీవి రామయ్య గొప్పతనం గురించి 2017లో కేంద్రం పద్మశ్రీ పురస్కారం ఇచ్చిన తర్వాత బయటి ప్రపంచానికి తెలిసింది. అంతటి పద్మశ్రీ పురస్కారం వచ్చినప్పటికీ.. వన జీవిరామయ్య తన హరిత సేవను మానుకోలేదు. పైగా తన సతీమణి జానకితో కలిసి మరింత ఉధృతంగా హరిత ఉద్యమాన్ని చేపట్టారు. శరీరం సహకరించకపోయినప్పటికీ.. ఒంట్లో శక్తి లేకపోయినప్పటికీ.. ఈ వయసులోనూ ఆయన మొక్కలు నాటడం మానుకోలేదు. ఆయనను పిలిచిన ప్రతి కార్యక్రమానికి వెళ్లేవారు. తనకు వినికిడి సమస్య ఉన్నప్పటికీ.. విద్యార్థులకు, ఇతర వ్యక్తులకు మొక్కల ప్రాముఖ్యం గురించి వివరించేవారు. తన మెడ, తల పై వృక్షో రక్షిత రక్షితః అనే ఒక బోర్డును తగిలించుకునేవారు. ఆయన భార్య కూడా అలానే చేసేవారు. అందువల్లే దరిపల్లి రామయ్య కాస్త వనజీవి రామయ్య అయ్యారు. తెలంగాణ అశోకుడిగా కీర్తి గడించారు. శనివారం ఆయన కన్నుమూసిన నేపథ్యంలో.. ఆయన పార్థివ దేహాన్ని రెడ్డిపల్లికి తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క నివాళులు అర్పించారు. ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఇతర అధికారులు వన జీవి రామయ్య పార్థివ దేహానికి నివాళులర్పించారు.
Also Read : తాగినోళ్లకు తాగినంత.. మందుబాబులకు ఇదో గొప్ప గుడ్ న్యూస్