Bhatti Vikramarka Wife: అప్పట్లో పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైనప్పుడు.. ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి తనకు అవకాశం కల్పించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణిగా ఉన్న నందిని విన్నవించారు. భారీగా వాహనశ్రేణితో తన బలాన్ని ప్రదర్శించారు. అంతేకాదు తన భర్త ద్వారా కాంగ్రెస్ పెద్దలను కలిసి.. టికెట్ ఇవ్వాల్సిన అవసరాన్ని వివరించారు.
నందిని అమ్మ ఫౌండేషన్ పేరుతో తన భర్త నియోజకవర్గం మధిరలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆమెకు రాజకీయాలంటే చాలా ఇష్టం. అందువల్లే అప్పట్లో ఎంపీగా పోటీ చేయడానికి ప్రయత్నాలు చేశారు. అయితే ఆమె, భర్త చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో.. ఎంపీ టికెట్ రాకుండా పోయింది. అయినప్పటికీ నందిని వెనుకడుగు వేయడం లేదు. ఎప్పటికైనా సరే రాజకీయాల్లోకి రావాలని.. ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి చట్టసభకు వెళ్లాలని ఆమె గట్టిగా భావిస్తున్నారు.
తాజాగా నందిని మీద ఒక ఆరోపణ వచ్చింది. ఆర్థిక శాఖ మంత్రిగా తన భర్త ఉన్న నేపథ్యంలో.. వివిధ బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఆమె కమిషన్ తీసుకుంటున్నట్టు విమర్శలు వస్తున్నాయి. విశ్రాంత ఉద్యోగుల బకాయిల విడుదల కోసం ఆమె కమిషన్ డిమాండ్ చేస్తున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. అంబర్ పేట ప్రాంతానికి చెందిన న్యాయవాది.. సామాజిక కార్యకర్త రేవంత్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం మీద పకడ్బందీగా దర్యాప్తు చేయాలని ఆయన కోరారు. గవర్నర్ కు లేఖ కూడా రాశారు.
తెలంగాణ రాజధాని లో ఇందిరా పార్క్ వద్ద ఈ నెల 9న విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో వైద్య ఆరోగ్యశాఖలో విశ్రాంత ఉద్యోగి.. అయ్యన్ టి యు సి అనుబంద ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న ప్రసన్న కుమారి సంచలన ఆరోపణలు చేశారు. తనకు ప్రభుత్వం నుంచి 40 లక్షలకు పైగా పదవీ విరమణ బకాయిలు రావాలని.. దీనికోసం 10% కమిషన్ అంటే దాదాపు నాలుగు లక్షలు అడిగారని ఆమె విమర్శించారు.. ఆమె చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. వైద్య ఆరోగ్యశాఖలోనే సుమారు 120 కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వీటికి సంబంధించిన దస్త్రాలు ముందుకు కదలాలి అంటే ఆరు నుంచి 10 శాతం వరకు కమిషన్ అడుగుతున్నట్టు తెలుస్తోంది. సదరు విశ్రాంత ఉద్యోగి ప్రసన్నకుమారి చేసిన ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని రేవంత్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. మరి దీనిపై గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.