Bangladesh vs Australia: ఇటీవల పాకిస్తాన్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. దాయాది జట్టును నేల నాకించింది. ఇదే ఊపులో బంగ్లాదేశ్.. ఇప్పుడు ఆపరేషన్ ఆస్ట్రేలియా మొదలుపెట్టింది. మొదలుపెట్టడమే కాదు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు చుక్కలు చూపిస్తోంది.
రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా బంగ్లాదేశ్ తో ఆస్ట్రేలియా తలపడుతోంది. గురువారం ఈ మ్యాచ్ మొదలైంది. పర్యాటక జట్టు ముందుగా బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టింది. బంగ్లాదేశ్ బౌలర్ల దూకుడు ముందు పర్యాటక జట్టు బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. అత్యంత ప్రమాదకరమైన హెడ్ 22.. వెదర్ ల్యాడ్ 23.. లబు షేన్ 1, గ్రీన్ 13.. క్యారీ 19.. వెబ్ స్టర్ 12.. కమిన్స్ 9, స్టార్క్ 1, లయన్ ఏడు పరుగులు చేశారు. దీనిని బట్టి ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎంతటి దారుణమైన ఇన్నింగ్స్ ఆడారో అర్థం చేసుకోవచ్చు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో స్మిత్ 71 పరుగులు చేయడంతో ఆ జట్టు ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది.
బంగ్లాదేశ్ బౌలర్లలో మహమ్మద్ ఆరు వికెట్లు పడగొట్టాడు. అహ్మద్ 2.. హోస్సేన్ రెండు వికెట్లు పడగొట్టారు.. బంగ్లాదేశ్ బౌలర్లు వేస్తున్న బంతులను ఎదుర్కోలేక ఆస్ట్రేలియా బ్యాటర్లు చుక్కలు చూశారు. పరుగులు తీయడం కాదు కదా.. వికెట్ కాపాడుకుంటే గొప్ప అన్నట్టుగా ఆస్ట్రేలియా బ్యాటర్ల బ్యాటింగ్ సాగింది. ఒక దశలో ఆస్ట్రేలియా 100 పరుగులకు అలౌట్ అవుతుందని అందరూ అంచనా వేశారు. ఈ దశలో స్మిత్ గట్టిగా నిలబడిన నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆమాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. 45 పరుగుల వద్ద వెదర్ ల్యాండ్ రూపంలో తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. ఏ దశలో కూడా ఆతిథ్య జట్టు బౌలర్లకు గట్టి పోటీ ఇచ్చినట్టు కనిపించలేదు. స్మిత్ నిలబడకపోయి ఉంటే ఆస్ట్రేలియా పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఇటీవల కాలంలో ఒక్క సిరీస్ కూడా ఆస్ట్రేలియా కోల్పోలేదు. కానీ అంతటి ఆస్ట్రేలియా జట్టుకు చుక్కలు చూపిస్తోంది బంగ్లాదేశ్. పదునైన బంతులు వేస్తూ.. వరల్డ్ క్రికెట్లోనే నెంబర్ వన్ బ్యాటింగ్ లైన్ అప్ ఉన్న ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగి బొమ్మ కనపడేలా చేస్తోంది.
ఇటీవల సిరీస్లలో వరుసగా విజయాలు సాధించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ జాబితాలో నెంబర్వన్ స్థానంలో కొనసాగుతోంది ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా జట్టులో బౌలింగ్ బాగుంది. బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. ఫీల్డింగ్ సరికొత్త స్థాయిలో ఉంది. అయితే అంతటి ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్ ముందు తలవంచటం.. పరుగులు తీయడానికి ఇబ్బంది పడడం సగటు క్రికెట్ అభిమానిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.