Revanth Reddy : నిజమే ఈ విషయం తెలిసిన తర్వాత చాలామందికి ఆశ్చర్యం అనిపించింది. ఆ తర్వాత ఇది ఎలా సాధ్యమనిపించింది. రాజకీయాలలో ఉప్పు నిప్పులాగా ఉండే వ్యక్తులు ఇలా కలిసిపోవడం ఏంటని చర్చ కూడా మొదలైంది.
తెలంగాణ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ వర్సెస్ బి ఆర్ ఎస్ అన్నట్టుగా ఉండేది. ఆ తర్వాత మధ్యలోకి బిజెపి వచ్చింది.. బిజెపి వర్సెస్ బిఆర్ఎస్ కూడా కొద్దిరోజులపాటు తెలంగాణలో సాగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బి ఆర్ ఎస్ అన్నట్టుగా తెలంగాణలో సాగుతోంది.
తెలంగాణ విషయాన్ని కాస్త పక్కన పెడితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి ఉప్పు నిప్పులాగా వ్యవహారం సాగుతోంది. దీనికి తోడు ఇటీవల నీట్ ఆందోళనల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మీద కమలం పార్టీ నాయకులకు పీకల దాకా కోపం ఉంది.. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు.. బిజెపి నాయకులు కలిసి కనిపించడం సాధ్యమేనా.. కనీసం కలిసి కూర్చొని భోజనం చేయడం సాధ్యపడుతుందా.. కానీ ఈ ప్రశ్నలకు నో అని కాకుండా అవును అని సమాధానం చెప్పారు ఓ తెలంగాణ మంత్రి.
ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెందిన పొన్నం ప్రభాకర్ ఇంట్లో కూడా బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పడగలను పురస్కరించుకొని పొన్నం ప్రభాకర్ తన ఇంట్లో విందు ఏర్పాటు చేశారు. ఆ విందుకు ముఖ్యమంత్రి.. ఇంకా కొంతమంది మంత్రులు హాజరయ్యారు. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేకపోయినప్పటికీ.. ఈ విందుకు బిజెపి ఎంపీ రఘునందన్ రావు హాజరు కావడమే ఆశ్చర్యంగా ఉంది. పైగా వచ్చిన అతిథులకు బంగారం పూత పూసిన ప్లేట్లలో భోజనం పట్టించారు. యాటకూర.. కోడి కూర.. బగారా అన్నం.. తలకాయ కూర.. స్వీట్లు.. ఇంకా రకరకాల ఐటమ్స్ తో పొన్నం ప్రభాకర్ తన రేంజ్ నిరూపించుకున్నారు.
పొన్నం ప్రభాకర్ విందు ఇవ్వడంలో వింత ఏమీ లేకపోయినప్పటికీ.. ఆ విందుకు రఘునందన్ రావు హాజరు కావడమే ఆశ్చర్యంగా ఉంది. తన రాజకీయ ప్రస్తానాన్ని గులాబీ పార్టీ ద్వారా మొదలుపెట్టారు రఘునందన్ రావు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. దుబ్బాక నియోజకవర్గంలో అనేకసార్లు పోటీ చేసి ఓడిపోయారు. చివరికి 2022లో విజయం సాధించారు. దుబ్బాకలో గెలిచిన తర్వాత రఘునందన్ రావు కీలక నాయకుడిగా మారిపోయారు. 2023 లో జరిగిన ఎన్నికల్లో రఘునందన్ రావు ఓడిపోయినప్పటికీ.. 2024 పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం బిజెపి ఎంపీగా గెలిచారు.
కాంగ్రెస్ పార్టీ విధానాల మీద.. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతూ విమర్శించే రఘునందన్ రావు పొన్నం ప్రభాకర్ ఇంట్లోకి రావడం.. బంగారు పూత పూసిన పళ్లెం లో విందు ఆరగించడం విశేషం. గతంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి రఘునందన్ రావు ఎన్నడూ ఇటువంటి విందు కార్యక్రమంలో పాల్గొనలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా.. అందువల్లే విందులో పాల్గొన్నారా అనే చర్చ కూడా మొదలైంది. రాజకీయాలు అన్నాక.. రాజకీయ నాయకులు అన్నాక కలిసి ఉండడం కుదరదా.. ఇలా కలుసుకోకూడదా అని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. అయినా రాజకీయ నాయకులకు గెట్టు తగాదాలు ఉండవు. కేవలం అవసరాలు మాత్రమే ఉంటాయి. వాటికి తగ్గట్టుగానే వాళ్ళ అడుగులు ఉంటాయి.