The paradise: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ.. భారత రాష్ట్ర సమితి మధ్య పోరు ఈనాటిది కాదు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యారో.. అప్పటినుంచే ఉప్పు నిప్పు వ్యవహారం లాగా మారిపోయింది. గులాబీ పార్టీ సవాళ్లు విసరడం.. దానికి రేవంత్ రెడ్డి ప్రతి సవాళ్లు విసరడం ఇలా సాగిపోతోంది.
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణలో రాజకీయ సమీకరణం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా తెలంగాణ బాబుగా ప్రచారం చేసుకుంటున్న కెసిఆర్ కామారెడ్డిలో ఓడిపోవడం.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది ఓటమి పాలు కావడంతో.. కాంగ్రెస్ పార్టీ తిరుగులేని స్థాయిలో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి గత ప్రభుత్వంలో జరిగిన పరిణామాలను.. ఇతర వ్యవహారాలను రేవంత్ తవ్వుతున్నాడు. అయితే ఇందులో అరెస్టుల వంటి వ్యవహారం జరగడం లేదు. వాస్తవానికి గులాబీ పార్టీ అదే కోరుకుంటున్నప్పటికీ.. గులాబీ పార్టీ నాయకులు జైలుకు వెళ్తే మైలేజ్ వస్తుందని భావించిన రేవంత్.. అలా చేయడం లేదు. తద్వారా తెలంగాణ రాజకీయాలలో సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇవి ఎక్కడిదాకా వెళ్తాయి అనే విషయాన్ని పక్కన పెడితే.. ప్రతిరోజు నాయకుల మధ్య వాదాలు.. సంవాదాలు జరిగిపోతూనే ఉన్నాయి.
ఇటీవల విడుదలైన ది ప్యారడైజ్ సినిమా సరికొత్త విషయాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఈ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రను అచ్చం కెసిఆర్ మాదిరిగానే రూపొందించాడు దర్శకుడు శ్రీకాంత్. ఈ పాత్రలో ప్రియదర్శి నటించాడు. ఆ తర్వాత గులాబీ పార్టీ కెసిఆర్ పాత్రను తెగ ప్రమోట్ చేయడం మొదలుపెట్టింది. చివరికి ఈ సినిమాను తమ సొంత సినిమా అన్నట్టుగా గులాబీ పార్టీ భుజాల మీద మోయడం ప్రారంభమైంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడో కాలడం ప్రారంభమైంది. అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్యారడైజ్ సినిమా మీద ట్రోలింగ్ మొదలుపెట్టారు. అసలు ఈ సినిమాకి కెసిఆర్ కి ఏం సంబంధం అని.. అసలు ఆ పాత్రకు కెసిఆర్ అని పేరు పెట్టారా అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో రెండుసార్లు కేసీఆర్ బయోపిక్ మీద చిత్రాలు వచ్చాయని.. రెండు ఫ్లాప్ అయ్యాయని.. ఇప్పుడు కేసీఆర్ పాత్రను హైలెట్ చేయడం ఎలా ఉద్దేశం ఏంటని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
దేశ్ కీ నేత అనే స్థాయి నుంచి చివరికి సినిమాల్లో ఒక క్యామియో రోల్ వరకు కెసిఆర్ స్థాయిని దిగజార్చారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ది ప్యారడైజ్ సినిమా టికెట్ల ధరల పెంపునకు ఒప్పుకుంది. ఆ సినిమాను ఆర్టీసీ ఎక్స్ రోడ్లో చూస్తానని నాని చెబితే.. సంబంధిత అధికారుల అనుమతులు తీసుకోవాలని సూచించింది. స్వయంగా ముఖ్యమంత్రి స్పందించి ఈ విషయాన్ని చెప్పారు. అయితే దీనిపై నాని ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాకపోతే ఆయన మైత్రి విమల్ థియేటర్లో ప్రేక్షకుల మధ్య ఈ సినిమా చూశారు. ఆ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక కేటీఆర్ కూడా ఇటీవల ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఈ సినిమాను చూశారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన విజయోత్సవ సభలో ప్రియదర్శి మాట్లాడారు. అక్కడ కూడా ఆయన కాలేశ్వరం.. ఇతర విషయాలను ప్రస్తావించారు. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇబ్బందికరంగా మారింది. ప్రియదర్శిని ఏమీ అనకుండానే.. ఆ వీడియో క్లిప్పింగ్ లతో గులాబీ పార్టీ నాయకులను విమర్శించడం మొదలుపెట్టారు. అటు గులాబీ పార్టీ నాయకులు కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో రెండు పార్టీల సంబంధించిన కార్యకర్తలు.. సోషల్ మీడియా వారియర్లు తీవ్రస్థాయిలో యుద్ధం చేసుకుంటున్నారు. ది ప్యారడైజ్ సినిమా ద్వారా నాని రెండు పార్టీల మధ్య చిచ్చుపెట్టాడని.. అది ఇంకా కొన్ని రోజులు ఇలానే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరి ఈ మంటను ఎవరు చల్లార్చుతారు.. ఈ సినిమాను గులాబీ పార్టీ ఏ విధంగా ఉపయోగించుకుంటుంది.. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కౌంటర్ ప్రోడక్ట్ రెడీ చేస్తుంది.. అనే విషయాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. అప్పటిదాకా రెండు పార్టీల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని చూసి ఎంజాయ్ చేయాల్సిందే.