Municipal Election Results: కనిపించిన ఇసుకను వదలలేదు. అటవీ భూములను వదలలేదు. లిక్కర్ వ్యాపారాన్ని వదలలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన అక్రమాలకు అంతే లేదు. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన దౌర్జన్యాలకు లెక్కేలేదు. అప్పట్లో ఆయన సాగించిన వ్యవహారాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కథలుగా చెప్పుకునేవారు.
భారత రాష్ట్ర సమితి అధికారాన్ని కోల్పోయిన తర్వాత.. ఆ రాజకీయ నాయకుడు వేగంగా పావులు కదిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో ఇల్లందు మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా విజయం సాధించారు. అంతటితోనే ఆగడం లేదు.. ఇప్పుడు ఏకంగా మున్సిపల్ పీఠం మీద కన్ను వేశారు. కాకపోతే ఆ పురపాలక సంఘానికి చైర్మన్ ను ఎంపిక చేసే బాధ్యత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద పడటమే ఇప్పుడు అసలైన టాస్క్.
ఇల్లందు మున్సిపల్ చైర్మన్ పదవి కోసం దాదాపు నలుగురు పోటీపడుతున్నారు. అందులో సదరు కబ్జాదారు కూడా ఉన్నారు. సదరు కబ్జా నాయకుడి పై గతంలోనే మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నాయకుడు గులాబీ పార్టీలో ఉన్నప్పుడు.. ఇల్లందు మున్సిపాలిటీలో పాలకవర్గంపై అవిశ్వాసం చోటుచేసుకుంది. ఆ సమయంలో పొంగులేటి ఆదేశాలు జారీ చేస్తే.. ఆ నాయకుడు ఏమాత్రం పట్టించుకోలేదు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి ఆ కబ్జా నాయకుడు వచ్చాడు. అయితే గతంలో తనకు ఎదురైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న మంత్రి శ్రీనివాసరెడ్డి ఆ కబ్జా నాయకుడి అక్రమాలపై దృష్టి సారించారు. అతడు ఆక్రమించిన అటవీ భూములకు రక్షణ కల్పించారు. అటవీ భూముల్లో అతడు నిర్మించిన కోళ్ల ఫారాలను.. అక్రమ నిర్మాణాలను తొలగించారు. అటవీ భూముల చుట్టూ కంచె నిర్మించారు. ఆ నాయకుడు ఆక్రమించిన భూములకు సంబంధించిన వివాదాలు ఇప్పటికీ కోర్టులో ఉన్నాయి. అంతేకాదు, ఆ నాయకుడు నిర్వహిస్తున్న లిక్కర్ షాప్ పై కూడా కేసులో నడుస్తున్నాయి.
ఈ స్థాయిలో ఆరోపణలు ఉన్నప్పటికీ.. అతడికి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఎవరు కల్పించారనేది ఇప్పటికీ ఒక రకమైన సందేహం. ఎందుకంటే నాడు పొంగులేటి ఆగ్రహం ఎదుర్కొన్న ఆ నాయకుడు.. కాంగ్రెస్ పార్టీలో చేరడం.. తన భార్యను ఇల్లందు మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా గెలిపించడం.. ఆమెని ఏకంగా చైర్పర్సన్ పీఠం మీద కూర్చోబెట్టాలని ప్రయత్నాలు చేయడం.. వంటివి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి…
ఒకవేళ ఆ నాయకుడు తనకున్న డబ్బు బలం ద్వారా అన్ని అడ్డంకులను తొలగించుకోగలిగితే.. తప్పకుండా తన భార్యను చైర్పర్సన్ చేస్తారు. అప్పుడు పొంగులేటి ఏం చేస్తారు? ఒకవేళ అతని భార్యకు చైర్పర్సన్ పదవి గనుక ఇస్తే కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టదా? మంత్రి శ్రీనివాస్ రెడ్డి కబ్జాలకు, ఆక్రమణలకు అందలం కల్పించినట్టు అవ్వదా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.