Konda Surekha: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిపోయారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా అక్కడే ఉన్నారు. భట్టి విక్రమార్క.. శ్రీధర్ బాబు.. ఇంకా కీలకమైన మంత్రులు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. చివరికి కొండా సురేఖ కూడా ఢిల్లీకి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే కేసి వేణుగోపాల్ విదేశాల నుంచి హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు.
ఇప్పటికే రేవంత్ రెడ్డి కేసి వేణుగోపాలతో మాట్లాడారు. కొండా సురేఖ వ్యవహారం.. ఇంకా కొంతమంది మంత్రుల వ్యవహార శైలిని ఆయన ముందు ఉంచారు. రేవంత్ రెడ్డి వాదనతో కేసి వేణుగోపాల్ ఏకీభవించినట్టు తెలుస్తోంది. దీనిపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కొండా సురేఖను పదవి నుంచి తప్పిస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే జరిగితే కొండా సురేఖ స్థానంలో ఎవరిని మంత్రిగా తీసుకుంటారు అనే ప్రశ్న కూడా వ్యక్తమవుతోంది. మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఆది శ్రీనివాస్ కు అవకాశం కల్పిస్తారని చర్చ నడుస్తోంది. ఇప్పటికే బీసీలలో కొన్ని సామాజిక వర్గాలకు మంత్రి పదవులు దక్కాయి. అలాంటప్పుడు కొత్తగా చేపట్టబోయే పునర వ్యవస్థీకరణలో ఎవరికి చోటు దక్కుతుందని చూడాల్సి ఉంది. రెడ్డి సామాజిక వర్గంలో మల్రెడ్డి రంగారెడ్డి.. సుదర్శన్ రెడ్డి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారు లైన్ లో ఉన్నారు. వీరిలో సుదర్శన్ రెడ్డి వైపు ముఖ్యమంత్రి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్.. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వంటి వారు కూడా మంత్రివర్గంలోకి రావాలి అనుకుంటున్నారు. అదే జరిగితే ఎవరిని సాగనంపుతారు.. కొత్తవారికి ఏ మంత్రి పదవులు కేటాయిస్తారు అనేది చూడాల్సి ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా రెండు సంవత్సరాలు కాలం ఉంది. ఈ కాలంలో చేపట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యమంత్రి మీద కొంతమంది ఎమ్మెల్యేలు ఆగ్రహం గా ఉన్నారు. మంత్రులు కూడా అదే ధోరణి కొనసాగిస్తున్నారు. ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది తప్పదు. రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ ఇవ్వకుండా అధిష్టానం ఇబ్బంది పెడుతోందని వాదనలు వినిపిస్తున్నాయి. మరి వీటికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ విధంగా సమాధానం చెబుతుంది.. ముఖ్యమంత్రికి ఎలాంటి స్వేచ్ఛ ఇస్తుంది.. కోల్పోయిన క్రమశిక్షణను ఎలా గాడిలో పెడుతుంది.. ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది. మంత్రులు.. కీలక నాయకులు ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం వరకు ఢిల్లీలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.