Harish Rao: కేటీఆర్ తెలంగాణలో లేడు. ఈనెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి తన అసలైన రాజకీయం మొదలుపెట్టాడు. ఢిల్లీలో ఉంటూ తన వ్యతిరేక శక్తులను తొక్కేసే పనిలో పడ్డాడు. అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కెసిఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రాడు. కవిత నేమో తనకు పార్టీలో ఎదురైన అవమానం గురించి చెప్పుకుంటూ బాధపడుతోంది. కన్నీరు కారుస్తోంది..
ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాలలో సరికొత్త ముఖచిత్రాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఈ క్రమంలోనే హరీష్ రావు పేరు పెద్దగా వినిపించడం లేదు. అందువల్లే ఆయన మీడియా ముందుకు వచ్చారు. అయితే తన ఆస్థాన మీడియా టీ న్యూస్.. నమస్తే తెలంగాణ ద్వారా కాకుండా.. ఈసారి ఆయన ఎన్టీవీ ని నమ్ముకున్నారు.
ఎన్ టీవీలో నిన్న సాయంత్రం హరీష్ రావు ఫేస్ టు ఫేస్ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా 22a అంశం గురించి ఆయన అనేక విషయాలను బయటపెట్టే ప్రయత్నం చేశారు. 22ఏలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ 2 అని.. రేవంత్ రెడ్డి ఏ వన్ అని విమర్శించారు. అన్ని జిల్లాల అధికారుల నుంచి యుద్ధ ప్రాతిపదికన 22ఏ జాబితా తెప్పించుకున్నారని.. భూములను ఆక్రమించారని.. ఆ జాబితా నుంచి భూములను తొలగించాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి.. రెవెన్యూ మంత్రి డిమాండ్ చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారని.. వారు వేసిన వెంచర్లు.. కొనుగోలు చేసిన భూములు.. అవి గతంలో ఏ పరిధిలో ఉండేవి.. ఇప్పుడు ఇంతకు అమ్ముకుంటున్నారు అనే విషయాలను అసెంబ్లీ వేదికగా బయటపెడతానని హరీష్ రావు పేర్కొన్నారు.
హరీష్ రావు మాట్లాడిన మాటల్లో వాస్తవం గురించి పక్కన పెడితే.. 22ఏ లో అధికారుల తప్పులేదని.. కేవలం ముఖ్యమంత్రి.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ వల్లే వారు అలా చేశారని హరీష్ రావు ఒప్పుకున్నారు. అలాంటప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధరణిలో లోపాలు.. ధరణి ద్వారా సాగిన అడ్డగోలు భూ వ్యవహారాలకు కారణం ఎవరు.. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కెసిఆర్.. రెవెన్యూ మంత్రేనా.. అప్పుడు ఎన్ని వేల కోట్లు దండుకున్నారు.. దేనికోసం ధరణి రూపొందించారు.. విదేశీ కంపెనీకి ఈ బాధ్యతను ఎందుకు అప్పగించారు.. ఎవరి ప్రయోజనాల కోసం విదేశీ కంపెనీకి ఈ బాధ్యతలు అప్పగించారు.. ధరణి వల్ల ఎంతమంది రైతులు ఇబ్బంది పడ్డారు.. భూములు కొనుగోలు చేయలేక.. అమ్ముకోలేక ప్రజలు ఏ స్థాయిలో అవస్థలు పడ్డారు.. వీటన్నిటికి కేసీఆరే కారణమా.. దీన్ని హరీష్ రావు ఒప్పుకుంటారా.. 22a ను కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకురాలేదు కదా.. భూభారతిలో దీనిని ఎత్తేశారు కదా.. ఈ విషయాన్ని హరీష్ రావు ఎందుకు గుర్తించడం లేదు.. ప్రజలు ఏదో గాయి కలిగించడానికి.. ఇంకా ఏదో చేయడానికి హరీష్ రావు ప్రయత్నించారు గాని.. అసలు విషయాన్ని దాచిపెట్టి ఏదేదో చెప్పుకుంటూ పోయారు. అసెంబ్లీ వేదికగా అన్ని ఎండగడతామని హెచ్చరించారు. హరీష్ రావు శ్రీనివాస్ రెడ్డి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తన వద్ద కూడా పకడ్బందీ ఆధారాలు ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..